తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అడుగు కూడా బయట పట్టలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచిర్యాల జిల్లా అన్నారానికి చెందిన ఓ గర్భిణీ.. చికిత్స కోసం చెన్నూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఆమెను మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వారి కుటుంబ సభ్యులు ఆంబులెన్స్‌లో ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పయనం అయ్యారు. అయితే రసూప్ పల్లి వద్దకు వచ్చేసరికి అంబులెన్స్ వాగులో చిక్కుకుంది.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ వాగు పొంగి పొర్లుతోంది. ఆ వాగు దాటాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ అక్కడ ఉన్న విషయం తెలుసుకున్న జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ బి రాజు, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలా ఆ అంబులెన్స్‌ను వాగు దాటించి తల్లీబిడ్డను కాపాడాలని ఆలోచించారు. అప్పుడే వాళ్లకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశారు.
క్షణాల్లో జేసీబీని తెప్పించారు పోలీసులు. వరద నీటికి అడ్డంగా జేసీబీ పెట్టారు. ఆ వరద ప్రభావం అంబులెన్స్ పై పడకుండా జేసీబీని అడ్డుగా పెట్టించారు. అదే సమయంలో ఓ పక్క నుంచి అంబులెన్స్ మెల్లిగా ముందుకు పోనిచ్చారు. అలా అంబులెన్స్, జేసీబీ సమాంతరంగా ముందుకు కదిలాయి. ఆ టైంలో అందరిలో ఒకటే టెన్షన్.
మొత్తానికి పోలీసుల సాహసంతో గర్భిణీ ఉన్న అంబులెన్స్‌ను సురక్షితంగా వాగు దాటించారు. అయితే సమస్యలో ఉన్నామని తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి తమకు సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని గర్భిణీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు సాయం చేసిన పోలీసులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రజలు కూడా పోలీసులు చేసిన సాయానికి ప్రశంసిస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన...
మరోవైపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇతర నేతలతో కలిసి వెళ్లారు. గ్రామాలన్నీ తిరుగుతూ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తపల్లి చెరువు నుండి వస్తున్న వరద నీరు లోతట్టు ప్రాంతాలకు పారుతూ... పట్టణంలోని పలు కాలనీలను ముంచేసింది. విషయం గుర్తించిన మంత్రి బాధితలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అలాగే తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మేయర్ వై సునీల్ రావు కమిషనర్ సేవా ఇస్లావత్ ఉన్నారు.
ప్రజలందరినీ కలిసి మాట్లాడారు. ఎలాంటి సమస్య ఉన్న తనకు సమాచారం అందించాలని... లేదంటే స్థానికంగా ఉన్న అధికారులకు చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నట్లయితే అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలికి శిబిరాలకు వెళ్లాలని సూచించారు. అక్కడ భోజనం, వసతి వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తామని వివరించారు. ఎలాంటి భయం లేకుండా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అన్ని వేళలా మీకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.