No defections into BJP without resignation of MLAs says Bandi Sanjay | కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే కచ్చితంగా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశం లేదని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ (Ramayan Circuit) కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ కోసం రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తైనట్లు తెలిపారు.
కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై 2 రాష్ట్రాల సీఎంల భేటీపై ఆయన మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నా, గత కేసీఆర్ ప్రభుత్వం (BRS Government) రాజకీయ లబ్ది కోసం సమస్యల్ని నాన్చిందన్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే వ్యవహరిస్తే విభజన సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు, రేవంత్ లను బండి సంజయ్ కోరారు. సీఎంలు చర్చించిన విషయాలు కేంద్రం దృష్టికి రావాలన్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై..
‘ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల విచారణకు, బీజేపీకి ఏం సంబంధం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించదు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు, కేసులన్న నేతలు బీజేపీలో చేరే ఛాన్స్ లేదు. ఇతర పార్టీల్లో గెలిచిన కాంగ్రెస్ లో చేరినట్లు.. రాజీనామా చేయకుండా బీజేపీలో చేరడం సాధ్యం కాదు. రాజీనామా చేసి బీజేపీకి రావాల్సిందే. కేశవరావు (కేకే)తో రాజీనామా చేయించిన కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరితేనే కాంగ్రెస్ కు గౌరవం. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే బీజేపీయే గెలుస్తుందని’ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, కొత్త వారికి ఆ పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదన్నారు.
రామాయణ్ సర్క్యూట్ పై వివరాలు
ఇల్లంతకుంట ,కొండగట్ట అలయాలను రామాయణ సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చేందుకు సిద్ధం. గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. కరీంనగర్ - హసన్ పర్తి రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వే జరిగింది. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటాం. రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
రేవంత్ కోరితే కాదు, స్మార్ట్ సిటీ మిషన్ గడువుపై క్లారిటీ
‘కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం ప్రభుత్వం పొడిగించలేదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు రానున్నాయని’ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.