Harish Rao Press Meet in Karimnagar News: కరీంనగర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని హరీష్ రావు అన్నారు. ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ, రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ పరిస్థితి ఎలా ఉందంటే.. అయితే తిట్లు లేకపోతే దేవుడిపై ఒట్లు. ఏ ఊరికిపోతే ఆ ఊరికి పోయి దేవుళ్లపై ఒట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని, బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని విమర్శించారు.
బీజేపీ, రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్..
‘బీజేపీతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దొంగే దొంగ అన్నట్టు సీఎం మాటలు. హుజారాబాద్, దుబ్బాక, మునుగోడుల్లో రేవంత్ బలహీన అభ్యర్థులను పెట్టి, బీజేపీ గెలవడానికి పరోక్షంగా సహకరించారు. నాగార్జున సాగర్ లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయి. రిజర్వేషన్ల రద్దుకు బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందని సీఎం అంటున్నాడు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం చేసింది. పార్లమెంటులో మేం కొట్లాడినం. గ్లోబెల్స్ ప్రచారంతో ఎంపీ ఎన్నికల గండం గట్టెక్కాలని రేవంత్ ప్రయత్నిస్తున్నాడు.’ హరీష్ రావు
రిజర్వేషన్లు పెంచుతారు కానీ రద్దు చేసేది ఉండదు
‘హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ అంటున్నారు. పేదలు, రైతులు, గిరిజనుల గురించి మాట్లాడటానికి బదులుగా, సెంటిమెంట్స్ రెచ్చగొడుతున్నారు. రిజర్వేషన్లు పెంచుతారు కానీ రద్దు చేసేది ఉండదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కందిపప్పు, స్టీలు, ఇసుక, సిమెంట్, కంకర రేట్లు పెరిగాయి. పేదవాడు కండుపునిండా తినే పరిస్థితి లేదు.. ప్రజల అజెండా పక్కకుపోయిన సెంటిమెంట్ల అజెండా ముందుకొస్తున్నది. కరీంనగర్ ప్రజలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేస్తేనే ప్రయోజనం కలుగుతుంది.
బీజేపీకి ఓటు వేయాలని కోరిన వ్యక్తి రేవంత్
బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని తీర్మానం చేశాం. అదానీని అలాబ్ బలాయ్ చేసుకుని, మోదీని బడే బాయ్ అని పొగిడి బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారు. ఆజ్ తక్ ప్రోగ్రాంలో బీజేపీకి ఓటు వేయాలని కోరిన వ్యక్తి రేవంత్. రేపు నామినేషన్ చివరి రోజు అనగా అభ్యర్థులను తేల్చకుండా బీజేపీకి సహకరించాడు. ఫైటర్ అని రేవంత్ రెడ్డిని బండి సంజయ్, అర్వింద్ పొగుడుతున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయారో ప్రజలకు అర్థమవుతోంది. కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుబడిన వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలి. కేంద్రంతో కొట్లాడిన ఆయన రైల్వే లైన్, స్మార్ట్ సిటీ తెచ్చాడు. ప్రశ్నించే గొంతుకైన వినోదన్నను గెలిపించాలి.
కేంద్రంలో బీజేపీ ఉన్నా బండి సంజయ్ చేసింది ఏమన్నా ఉందా? మాటలు తప్ప చేతలు శూన్యం అని హరీష్ రావు సెటైర్లు వేశారు. బీజేపీ కార్యకర్తల కష్టసుఖాలు కూడా పట్టించుకోలేదు అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్లో మంచినీళ్లకు బదులు మురికి నీళ్లు వస్తున్నాయని రేవంత్ ఇంకా గుర్తించలేదా అని ప్రశ్నించారు. బస్సు యాత్రతో ప్రజలు బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు.