Karimnagar Latest News: బీజేపీలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచందర్‌రావుకు మరో సవాల్ ఎదురైంది. కరీంనగర్ బీజేపీలో ముసలం పుట్టినట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త సైలెంట్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువుతో కోట్లాడుతామే కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకునే కుట్రలు చేయడం తెలియదని అన్నారు. తనపై తన వర్గంపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్నింటినీ ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. 

రేపటి గెలుపునకు షామీర్‌పేట అడ్డగా మారుతుందని ఈటల అన్నారు. తాను బీజేపీలోకి అడుగు పెట్టే వరకు అక్కడ బీజేపీకి కార్యకర్తలే లేరని చెప్పుకొచ్చారు.తాన వచ్చిన తర్వాత గ్రామగ్రామన పార్టీ బలోపేతం అయిందని చెప్పుకొచ్చారు. అలాంటిది తనను కోవర్ట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "రేపటి గెలుపునకు సంకేతం ఇచ్చే అడ్డా షామీర్‌పేట. దాన్ని పట్టుకొని వాడు ఎవడో వాడు సైకోనా? శాడిస్టా? మనిషా? పశువా? వాడు ఏ పార్టీలో ఉన్నాడు? ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు? వాడిని ఏనాలి?. బి కేర్‌ఫుల్‌ కొ*కా! మేము శత్రువుతో కొట్లాడుతాం కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కావలిచ్చుకునే సంస్కృతి మా రక్తంలో లేదు. " అని వార్నింగ్ ఇచ్చారు. 

సోషల్ మీడియాలో తప్పుడు కూతలు కూస్తున్న వాళ్లకు సమాధాం చెబుతానని ఈటల అన్నారు. ఇలాంటి వారిని పార్టీ అరికడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేకుంటే ఎవరికి నష్టమే అర్ధంచేసుకోవాలని చెప్పారు."ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్న సంస్కారం ఉందని సభ్యత ఉందని ,ఇట్లాంటి వాటిని అరికడతారని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. " అని అన్నారు. 

ఇలాంటి వాళ్ల చరిత్ర ప్రజలకు బాగా తెలుసనని అన్నారు ఈటల. తన పని తీరు ఏంటో కూడా తెలుసునని చెప్పుకొచ్చారు. "ఇలాంటి వారిని నివారించకపోతే నష్టం జరిగేది మాకు కాదు.మాకు ఏం తక్కువ ఉంది. అసలు మీరు ఎవరు. అసలు నీ శక్తి ఏంది. నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా, నా జిల్లాకి 2002లో వచ్చినా. జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశా. నేను రెండుసార్లు మంత్రిగా పని చేసినా. నా అడుగుపడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు ఒక కమలాపుర్ వచ్చినోళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా వచ్చేది. పక్క జిల్లాల ప్రజలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయారు.నేను పోని మండలం ఉంటదా నేను మాట్లాడనటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసు కొ*కా అని విరుచుకుపడ్డారు. 

ఈటల రాజేందర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రిని టార్గెట్ చేస్తూనే ఈటల రాజేందర్ ఇలాంటి కామెంట్స్ చేశారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆ మంత్రి తనను ఓడించేందుకు హుజూరాబాద్‌లో కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఈటల రాజేందర్‌పై ఒత్తిడి పెరిగింది. 

ఈటర రాజేందర్‌ అనుచరులు గత కొన్ని రోజుల నుంచి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేందమంత్రిగా ఉన్న వ్యక్తి తమను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారని పార్టీలో ఉండాలా బయటకు వెళ్లిపోవాలా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇవాళ ఏకంగా ఈటల ఇంటికే అభిమానులు తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన ఈటల ఆ మంత్రిపై విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. 

స్థానికంగా నాయకులను ప్రోత్సహిస్తేనే రేపటికి గెలుపు ఈజీ అవుతుందని అన్నారు. 2002నుంచి తాను అదే నమ్ముతున్నానని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా హుజూరాబాద్‌లోని ప్రతి గ్రామం, మండలంలో తన అనుచరులే పోటీ చేస్తారని విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. 

కేంద్రమంత్రి, మాజీ మంత్రి మధ్య సాగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటను కొత్తగా ఎంపికైన స్టేట్ పార్టీ అధ్యక్షుడు ఎలా డీల్ చేస్తారో అన్న ఆసక్తి బీజేపీలో ఉంది.