హరీశ్ రావు హుజూరాబాద్‌లో అడ్డా పెట్టి అబద్ధాలతో కారు కూతలు కూస్తున్నారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. డ్రామా కంపెనీలాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టుకుంటూ యాక్షన్ చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్ధం ఉందని.. ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్ధతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బోడిగ శోభ, యెండల లక్ష్మీ నారాయణ, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. టీఆర్ఎస్ ఓడిపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘హరీశ్ రావు నీకు సవాలు చేస్తున్న.. రాష్ట్రంలో అభివృద్ది జరగలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టలేదు. కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవు. నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నరని ఆరోపణలు చేస్తున్నవు. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసురుతున్నా. నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా.. నువ్వు పెద్ద తోపు, తురుం ఖాన్‌వి కదా బహిరంగ చర్చకు సిద్ధమా?’’ అని ఈటల రాజేందర్ సవాలు విసిరారు.
‘‘హరీశ్ రావు ఒక నీచుడు. ఆయన నిర్వాకంపై ప్రజలు ఉమ్మేస్తున్నారు. బిడ్డా హరీష్.. హుజూరాబాద్‌లో నువ్వు నడిచే రోడ్లు ఎవరు వేసిన్రు. అసలు నీకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వను అన్నది నిజం కాదా? ఇప్పుడు హరీష్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టిండు. సీఎం పోటీకి వస్తున్నడని తనను తొలగించారా? లేక భూముల కబ్జా చేశాడనా? మర్యాదగా చెప్తున్నా.. పోలీసు దండును వెంటనే ఆపాల. గతంలో హరీష్ రావు వేరు.. ఇప్పుడున్న హరీశ్ రావు వేరు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి చెప్పిన వారికే ఆర్థిక మంత్రిగా నిధులు విడుదల చేస్తున్న కీలు బొమ్మగా మారారు. ఎవరి బాగోతాలు ఏమిటో త్వరలో ప్రజలకు తెలుస్తుంది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు డబ్బులు పంపిణి చేసింది హరిష్ రావు కాదా?’’
‘‘నేను ఉద్యోగాలు పెట్టిచ్చిన వారిని బెదిరించి ఉన్న ఉద్యోగాలు కూడా తీయించేస్తున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తున్న వారిని కూడా వదలకుండా బిల్లులు రావాలంటే టీఆర్ఎస్‌కు అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తెస్తున్నడు. హరీష్ రావు, తలకాయ కిందకి, కాళ్లు పైకి పెట్టినా.. టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో గెలవదు’’ అని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.