Vemulawada Rajanna Temple News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక శివరాత్రి, ఇతర ముఖ్యమైన పండుగల సమయంలో వీరి సంఖ్య లక్షలకు చేరుతుంది. చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి వస్తారు. అయితే ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ ఆలయంలో ఇప్పుడు స్నానం చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు.
ధర్మగుండం పరిస్థితి ఇదీ..
ఆలయంలోని ప్రధాన ధర్మగుండం రెండున్నర ఏళ్ల క్రితమే కోవిడ్ విస్తృతంగా పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త దృష్ట్యా మొదట్లోనే మూసివేశారు. అయితే అప్పటి నుండి కోవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గు ముఖం పట్టినప్పటికీ అధికారులు మాత్రం తిరిగి ధర్మగుండం (Dharmagundam) వాడుకలోకి తేకపోవడంతో భక్తుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మొదటి వేవ్ ప్రారంభమైన 2020 మార్చి 20వ తారీఖున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మగుండం పూర్తిగా మూసివేశారు. ఇక కేవలం ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాత్రమే అది కూడా కేవలం కొద్ది మంది భక్తులకు మాత్రమే అందుబాటులో ఉంచి ఆ తర్వాత మూసి వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ లేనివిధంగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తుండడంతో సౌకర్యాల పట్ల స్థానికేతర భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ధర్మగుండం విశేషాలు
దాదాపుగా 80 అడుగుల పొడవు వెడల్పు 25 అడుగుల లోతుతో పది లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ ధర్మగుండంలో (Vemulawada Dharmagundam) ఒకేసారి 500 మంది వరకు భక్తులు స్నానాలు చేయవచ్చు. 40 మెట్లతో విశాలంగా ఉండే ఈ ధర్మగుండంలో ముఖ్యమైన పండుగ సమయంలో సాధారణ సామర్థ్యానికి దాదాపు కొన్ని రెట్ల సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఇక అధికారులు పట్టించుకోకపోవడంతో ఆరు బయట ఉన్న కళ్యాణ కట్ట, వాహనాల పార్కింగ్ స్థలం , పార్వతిపురం నల్లాల వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నారు.
అయితే మగవారు ఎక్కడైనా స్నానాలు చేయగలరు కానీ యువతులు, మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర అసౌకర్యానికి గురైనా కూడా అధికారులు కనీస చలనం లేదు. సాధారణంగా దూర ప్రయాణాల తర్వాత స్నానాలు చేసే స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి భక్తులకు అనివార్యమైంది. ధర్మగుండం తిరిగి ప్రారంభించాలని ఇప్పటికే ఆలయ అధికారులు రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కి ప్రతిపాదనలు పంపించారు. కానీ దీనిపై ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి లభించకపోవడంతో ఆలయ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇచ్చినా తిరిగి వినియోగం లోకి తేవాలంటే సమయం పడుతుంది. కాబట్టి మరోవైపు పండుగలు సమీపిస్తున్న వేళ భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకొని త్వరగా సమస్య పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.