Bandi Sanjay News: కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ నెరవేర్చనుంది. సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92) ఈనెల 12 నుంచి జమ్మికుంటలో ఆగనుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి 11.30  గంటల మధ్య జమ్మికుంటలో ఈ రైలు ఆగనుంది.


 దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌ను జమ్మికుంటలో ఆపేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో స్వయంగా మాట్లాడారు. తప్పనిసరిగా జమ్మికుంటలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంట స్టేషన్‌లో ఆగేలా ఏర్పాట్లు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


ప్రతిరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఖాజీపేట మీదుగా జమ్మికుంట చేరుకోనుంది. ఉదయం 11 నుంచి 11.30  గంటల మధ్య జమ్మికుంటలో ఈ రైలు ఆగుతుంది. అక్కడి నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బళ్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ మీదుగా జబల్ పూర్, సాత్నా, వారణాసి(కాశీ), బక్సర్ మీదుగా 5 రాష్ట్రాలు ప్రయాణించి దాణపూర్ చేరుకుంటుంది. జమ్మికుంటతో కలిసి మొత్తం 30 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. దాదాపు 34 గంటలపాటు నడిచే ఈ రైలు 1830 కి.మీలు ప్రయాణించనుంది. 


మహారాష్ట్రలోని నాగపూర్‌తోపాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఎంతో ఉపయోగపడనుంది. దాణాపూర్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ప్రయోగాత్మకంగా మాత్రమే ఈ రైలును జమ్మికుంటలో ఆపుతున్నామని, ప్రయాణీకుల రద్దీ, డిమాండ్‌ను బట్టి రెగ్యులర్‌గా నడిపేలా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.


దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంటలో ఆపడంపై బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైల్వే శాఖ అధికారులకు థాంక్స్ చెప్పారు. నాగపూర్, కాశీ సహా ప్రసిద్ధ పట్టణాలతోపాటు 5 రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణీకులంతా ఈ రైలును వినియోగించుకోవాలని కోరారు. 
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రైల్వే శాఖ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌తో కాశీ, నాగపూర్ వంటి పట్టణాలకు నేరుగా వెళ్లే అవకాశం కలిగిందని, తద్వారా ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని అభిప్రాయపడ్డారు. తమ విజ్ఞప్తికి స్పందించిన బండి సంజయ్‌కు, రైల్వే శాఖకు ధన్యావాదాలు తెలిపారు.