కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ టీఆర్ఎస్ నేతల్ని వదలడం లేదు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఇవాళ (నవంబరు 20) సీబీఐ అధికారులు వెళ్లారు. అదే సమయంలో ఇంటి వద్ద మంత్రి లేకపోవడంతో కొంచెం సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీబీఐ అధికారులు రాకముందే మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌‌కు కారులో వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి తాను సీబీఐ అధికారి అంటూ గంగుల కమలాకర్‌తో తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో ఆ వ్యక్తి మంత్రిని కలవగా, ఆయన నకిలీ సీబీఐ అధికారి అని తర్వాత తేల్చారు.


ఆ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు గంగుల కమలాకర్ ఇంటికి నేడు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ వ్యక్తి గంగులను కలిసి ఏం మాట్లాడారనే అంశాలను సీబీఐ అధికారులు మంత్రి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. 


మంత్రి గంగుల స్పందన


‘‘మూడు నాలుగు రోజుల కిందట శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ కార్యక్రమంలో నాతో పరిచయం చేసుకున్నాడు. ఆ అంశంలో వివరాల కోసమే సీబీఐ అధికారులు మా ఇంటికి వచ్చారు. ఏం జరిగిందో చెప్పాలని 160 కింద నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఢిల్లీ వెళ్లి ఏం జరిగిందో చెబుతా, అంతే. వేరే కారణాలతో సీబీఐ అధికారులు రాలేదు’’ అని మంత్రి గంగుల కమలాకర్ వివరణ ఇచ్చారు. వారు వచ్చేసరికే తాను హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయినట్లు మంత్రి తెలిపారు.


మంత్రి గంగుల కమలాకర్‌కు సొంతమైన శ్వేత గ్రానైట్స్‌ కంపెనీకి సంబంధించి విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం ఈడీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. గంగుల ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.


విచారణకు రావాలని మంత్రికి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు


అంతేకాక, మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనందున ఢిల్లీలో జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్‌ సంస్థలు నడుపుతున్నారు. ఇటీవల గంగుల కమలాకర్ దుబాయ్ పర్యటనలో ఉండగా.. అనూహ్యంగా ఆయన ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉండగా.. మంత్రిని సంప్రదించే ప్రయత్నం చేసి తాళాలు పగులగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఎంపీ రవిచంద్రకు చెందిన గ్రానైట్‌ సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి.


కరీంనగర్ గ్రానైట్ వ్యాపారుల అక్రమాలపై ఈడీకి పలు ఫిర్యాదులు


కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఈడీ ఎనిమిది సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులు.. వారికి అత్యంత సన్నిహితులవేనని చెబుతున్నారు. ఈడీ నోటీసులు వచ్చిన చాలా కాలానికి సోదాలు చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో 30 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. కరీంనగర్ మైనింగ్ కేసులో 170 కోట్లు అవినీతి జరిగిందని.. అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్లు రూపాయలు ప్రభుత్వానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  రైల్వే, షిప్స్ లలో విదేశాలకు మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ కోట్లు రూపాయలు సంపాదించారుని ఈడీకి ఫిర్యాదులు అందాయి.