Hyderabad Crime News | హైదరాబాద్: నగరంలో చదువుకుంటున్న ఒక బీటెక్ విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తన కొడుకు ఏమయ్యాడో, అతడి ఆచూకీ తెలియక కన్నతల్లి తల్లడిల్లిపోతున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 8074856067, 6300799651 నెంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు.
అసలేం జరిగిందంటే.. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అంకం రాహుల్ అనే విద్యార్థి మే 25న అదృశ్యమయ్యాడు. గత 10 రోజుల నుండి అతడి ఆచూకీ లభించడం లేదు. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ ఫైనల్ చదువుతున్న విద్యార్థి హైదరాబాద్‌లోని తన హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో, అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా గాలిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొడుకు జాడ లభించకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చివరగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడని, ఆ తరువాత నుంచి ఆచూకీ లేదని సమాచారం. ఓ యువతితో గొడవ జరిగిన తరువాత నుంచి రాహుల్ కనిపించడం లేదని తెలుస్తోంది.
రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామం. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన తమ బిడ్డ ఇలా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడనే వార్త తెలియడంతో ఐలాపూర్ గ్రామంలో, అతని కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, దర్యాప్తులో భాగంగా రాహుల్ చివరిసారిగా హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కనిపించినట్లు సమాచారం అందింది. ఆ తర్వాత అతను ఎటు వెళ్లాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎదిగిన కొడుకు, త్వరలో జాబ్ చేసి కుటుంబానికి ఆసరగా మారతాడనుకున్న సమయంలో అదృశ్యం కావడంతో అంకం రాహుల్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘నా కొడుకు రాహుల్ ఎక్కడైనా కనిపిస్తే దయచేసి మాకు ఫోన్ చేసి చెప్పండి. వాడు లేకపోతే మేము బతకలేము. రాహుల్ వివరాలను వీలైనంత వరకు సోషల్ మీడియాలో షేర్ చేయాలని, అతను క్షేమంగా ఇల్లు చేరడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని’ ఆమె చేతులు జోడించి అందరినీ కోరారు. ఈ బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ రాహుల్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే స్థానిక పోలీసు అధికారులకు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
