అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల కోసం కరీంనగరం ముస్తాబైంది.. శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్ బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలను గతంలో కన్నా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అటు స్వామి వారి ఆలయంతో పాటు. నగరంలోని ప్రధాన రహదారుల పక్కన భారీ కటౌట్లను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తళుకులీనుతున్న విద్యుత్ దీపాలతో కరీంనగర్ సరికొత్త శోభను సంతరించుకుని నగర వాసులను ఆలరిస్తుంది. స్వామి వారి భక్తులను పులకింపజేస్తుంది.
స్వాగతం పలుకుతున్న కటౌట్లు..
ప్రధానంగా ప్రధాన రహదారుల పక్కన ఏర్పాటు చేసిన కటౌట్లు కరీంనగర్ వాసులను అలరిస్తున్నాయి. బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఐలాండ్ లో వెలిగే విద్యుత్ దీపాలు మనస్సును ఆహ్లాదపరుస్తాయి. మనశ్శాంతిని కలిగిస్తాయి. బస్ స్టేషన్ నుండి పోలీసు కమీషనర్ ఆఫీస్ మీదుగా గోపురం మాదిరి కటౌట్ నుండి లోపలకు వెళ్ళే ఆలయానికి వెళ్ళే భక్తులకు 4 పిల్లర్ల మీద వివిధ దేవతా మూర్తులతో ఏర్పాటు చేసిన కటౌట్లు ఆశీర్వదిస్తూ ఘనస్వాగతం పలుకుతాయి. ఈ కటౌట్ కింది నుండి లోపలికి వెళ్తుంటే రహదారికి ఇరుపక్కల వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంబాలు మనస్సును పులకింపజేస్తాయి. అక్కడి నుండి కుడివైపు తిరిగితే... ఇరు ప్రక్కల విద్యుత్ కాంతులతో తణుకులీనే స్థంబాలతో పాటు వాటి ఆవల దేదిప్యమానంగా వెలిగిపోయే స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. తెలంగాణ చౌక్ ఐలాండ్ లో స్వామి వారి భారీ కటౌట్ దర్శనమిచ్చి భక్తులను అలౌకిక ఆనందానికి గురిచేస్తుంది. అంతే కాకుండా తెలంగాణ చౌక్ నుండి కమాన్ వరకు ఏర్పాటు చేసిన లైటింగ్ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
రంగు రంగుల విద్యుత్ దీపాలు...
మరో వైపు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ కటౌట్లతో అందంగా తీర్చిదిద్దారు. దేవతా మూర్తుల కటౌట్ల కింది నుండి లోపలికి వెళ్తే.. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టెంట్లు దర్శనమిస్తాయి. వాటి గుండా లోపలికి వెళ్తే బ్రహ్మోత్సవాలకు సిద్దమైన స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఆలయంలో యజ్ఞం కోసం నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాల మధ్య ఏర్పాటు చేసిన యజ్ఞగుండం దర్శమిస్తుంది. బయట తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన వేదిక కనిపిస్తుంది. అంతే కాకుండా బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యలు కనిపిస్తాయి.
అధ్యాయనోత్సవాలు...
బ్రహ్మోత్సవాలు జనవరి 23వ తేదీ స్వస్తీశ్రీ శుభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ద విదియ రోజున సాయంత్రం 6 గంటలకు ఆధ్యాయనోత్సవంతో ప్రారంభమై ప్రబంధ పారాయణం తీర్ధప్రసాద ఘోష్టి... 2వ రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రబంధ పారాయణం, సాయంత్రం ప్రబంధ పారాయణం, తీర్థ ప్రసాద ఘోష్టి చేస్తారు. 3వ రోజు ఉదయం సాయంకాలం వేళల్లో పారాయణం, సాయంత్రం పరమపదోత్సవం, తీర్థప్రసాద ఘోష్టి, ఇలా 3 రోజుల పాటు అధ్యాయనోత్సవాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలు...
4వ రోజు 26వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టం ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటలకు చకిలం ఆగయ్య-సత్యలక్ష్మీల జ్ఞాపకార్ధం నూతన కార్యాలయ భవన ప్రారంభం గణపతి హోమము, సహస్రకళశాభిశేకం, సాయంవేళ సహస్ర కళాశాభిషేకం నిర్వహించనున్నారు. 5వ రోజు ఉదయం 8 గంటలకు అంకురార్పణ, పాతబజార్ గౌరిశంకరాలయం నుండి పుట్టమన్ను తీసుకువచ్చుట, సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం... రక్షబంధనం, అంకురార్పణ, ధ్వజాదివాసం శేషవాహన సేవ నిర్వహించనున్నారు.
6వ రోజు ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, పూర్ణాహుతి, ధ్వజావరోహణ... సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు నిర్వహించనున్నారు. 7వ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన వేదపండితులు వేదవాచాస్పతి శ్రీ గుళ్ళపల్లి క్రిష్ణమూర్తి ఘనాపాఠి వారిచే సుప్రభాత సేవ, అన్నకూటోత్సవం, కల్పవృక్ష వాహన సేవ, ఎదురుకోళ్ళు, ఆశ్వవాహన సేవ గజవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8వ రోజు ఉదయం స్వామి వారికి కళ్యాణోత్సవం సాయంత్రం గరుడు వాహన సేవ నిర్వహించనున్నారు. 9వ రోజు ఉదయం హనుమత్ వాహన సేవ సాయంత్రం సింహవాహన సేవ చేపట్టనున్నారు. 10వ రోజు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం, పుష్పయాగం నిర్వహించి 11వ రోజు స్వామి వారి శోభాయాత్రను చేపట్టనున్నారు.
మంత్రి గంగుల ఏమన్నారంటే :
గత ఐదు సంవత్సరాలుగా చేపట్టిన బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ మార్కెట్ లో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారు స్వయంభువుగా వెలిశారని భక్తితో మొక్కితే చాలు కోరికలను నెరవేరుస్తారు అని విశ్వాసం. అలాంటి స్వామి వారికి ఇప్పటి వరకు వరుసగా ఐదు సార్లు విజయవంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. ఇప్పుడు షష్టమ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నం. స్వామి వారి దయవల్ల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే తన అభిమతమని నాలో శక్తి ఉన్నంత వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాను.
ఈ బ్రహ్మోత్సవాల్లో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మోత్సవాలు కొనసాగాలని స్వామి వారిని వేడుకుంటున్నాను. ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం సంస్కృతిక కార్యక్రమాల్లో సినీ గాయని శ్రీలలిత, సరిగమ ఫేమ్ కుమార్ శ్రీకృతి భక్తి సంగీత విభవరి, శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ వారి భక్ర ప్రహ్లాద, పాతాళ భైరవి నాటికలు, సినీ నేపథ్య గాయకులు శ్రీక్రిష్ణ, చిలువేరు శ్రీకాంత్, సంధ్య... దివ్య భక్తి కీర్తనలు, సినీ నేపథ్య గాయని సునితల భక్తి సంకీర్తనలు నగర వాసులను అలరించనున్నాయి.