Jagtial News : జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ వ్యతిరేక ఆందోళనలు చివరికి అధికార పార్టీలోనే ముసలం పుట్టిస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఏకపక్షంగా వ్యవహరించడంతో అటు పార్టీకి ఇటు పాలక కమిటీకి సమస్యలు ఎదురయ్యాయని సొంత పార్టీ కౌన్సిలర్లు ఎదురు తిరుగుతున్నారు. ఏకంగా 38 కౌన్సిలర్లు అధికార పార్టీకి చెందినవారిలో దాదాపుగా 27 మంది శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిశారు .చైర్ పర్సన్ బోగస్ శ్రావణి పలు నిర్ణయాలను సొంతంగా తీసుకుంటూ బలవంతంగా తమపై రుద్దడంతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని వారంతా విన్నవించారు. మరోవైపు ఒకవేళ ఆమెను తొలగించకుంటే ఏకంగా అవిశ్వాసం పెడతామని ఎమ్మెల్యేకి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో ఒక్కసారిగా జగిత్యాల పురపాలక సంఘంలో రాజకీయ వేడి మొదలైంది.


అసలేందుకిలా? 
 
మొత్తం 48 వార్డులు ఉన్న జగిత్యాల పురపాలక సంఘంలో మెజారిటీ అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఈ 38 మందిలో ఏకంగా 27 మంది తిరుగుబాటు చేయడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓ కౌన్సిలర్ ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగా విమర్శించడమే కాకుండా కౌన్సిల్ సమావేశంలో ఎజెండా ప్రతులను చింపి విసిరేశారు. ఇక మరో కౌన్సిలర్ చైర్ పర్సన్ ను ని టార్గెట్ చేస్తూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారంటూ ఆరోపణలు చేశారు. గందరగోళంగా ఉన్న పురపాలక సంఘంలో ఇమడలేక కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఏకంగా పదిమంది కమిషనర్లు మారడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక ఇప్పటివరకు ఒక లెక్క మాస్టర్ ప్లాన్ తర్వాత ఒక లెక్కలా మారింది పరిస్థితి. పట్టణ పరిధిని దాటి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను మాస్టర్ ప్లాన్ లో చేర్చడంతో పాటు వివిధ జోన్ల పరిధిలోకి తేవడంతో ఒకేసారి ఆందోళనలు మిన్నంటాయి. 


ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా సంతకాలు 


మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా 15 రోజులపాటు రైతులు ఆయా గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేస్తూ రహదారులను దిగ్బంధం చేశారు. ఈ అంశం అటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ శుక్రవారం మున్సిపాలిటీ ప్రత్యేకంగా సమావేశం తీర్మానించింది. ప్రజా అభిప్రాయం పూర్తిగా సేకరించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయా గ్రామాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ప్రజా ప్రతినిధులు... పనిలో పనిగా చైర్ పర్సన్ ను మార్చాలంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు చైర్ పర్సన్ బోగ శ్రావణిని తొలగించాలంటూ సంతకాలు చేసి మరి ఎమ్మెల్యేకి ఇవ్వడం ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారింది. చివరికి ఇది ఎటు దారితీస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాతో మరోసారి అధికార పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.