Telangana Politics | హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay). ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. సీఎం రమేష్ చేసిన సవాల్‌కు కేటీఆర్ (KTR) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేటీఆర్ కనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్వీకరిస్తే కనుక వీరి మధ్య బహిరంగ చర్చకు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
చర్చకు డేట్, టైం ఫిక్స్ చెయ్ కేటీఆర్..
‘చర్చకు కేటీఆర్ రెడీ అంటే కనుక డేట్, టైం ఫిక్స్ చేయాలి. సీఎం రమేష్ ను నేను తీసుకొస్తాను. బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని చాలాసార్లు చెప్పాం. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ సైతం నిజామాబాద్ సభలో చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరుగుతుంది. సీఎం రమేష్ ఆర్థిక సాయంతోనే కేటీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారని’ బండి సంజయ్ ఆరోపించారు.
కంచ గచ్చిబౌలి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీకి కట్టబెట్టిందన్న కేటీఆర్ ఆరోపణలతో వివాదం మొదలైంది. సీఎం రమేష్‌కు లబ్ది చేకూర్చాలని రేవంత్ రెడ్డి కమీషన్లు తీసుకుని సర్వనాశనం చేస్తున్నాడని కేటీఆర్ చేసిన ఆరోపణలు క్రమంగా ముదిరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రయత్నాలు బయటకొచ్చాయి. ఫ్యూచర్ సిటీలో 1600 కోట్లకు పైగా రోడ్ల కాంట్రాక్ట్ సీఎం రమేష్ కు కట్టబెట్టారని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కవిత జైల్లో ఉన్న సమయంలో ఆమెను విడిపించాలని కోరుతూ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని సైతం కేటీఆర్ ప్రతిపాదన తీసుకొచ్చారని సీఎం రమేష్ సంచలన విషయాలు వెల్లడించారు.
కేటీఆర్ తన ఇంటికి వచ్చారన్న సీఎం రమేష్..
కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులతో తనకు సంబంధం లేదన్న సీఎం రమేష్ ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన విషయం మరిచిపోయావా అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కవిత విచారణ ఆపేస్తే, ఆమె జైలు నుంచి విడుదలయ్యేందుకు సహకరిస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని ప్రతిపాదన చేయలేదా అని సీఎం రమేష్ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అంటే కనుక ఢిల్లీలో కేటీఆర్ నా ఇంటికి వచ్చిన సీసీటీవీ వీడియో ఫుటేజీ రిలీజ్ చేస్తానని చెప్పడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అవినీతి పార్టీ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు బీజేపీ ఎంపీ. కంచ గచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీలో ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం ఆపి ముందు సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రమేష్ ఇంటికి వెళ్లిన విషయంపై, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించాలన్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఇందులో జోక్యం చేసుకున్నారు. రమేష్ కు సంబంధించిన కాంట్రాక్టులపై, ఇటు బీఆర్ఎస్ పార్టీ అవినీతి, బీజేపీలో విలీనంపై చర్చకు డేట్, టైం ఫిక్స్ చేయాలని కేటీఆర్‌కు సూచించారు.