TS Govt Employees: తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిలువుటద్దమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి, పింఛన్‌దారులకు పెన్షన్లు ప్రతినెలా 1వ తేదీన చెల్లించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 2014లో 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని, రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారు. ప్రతినెలా 1 వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం, రిటైర్ అయినవారికి పెన్షన్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని బండి సంజయ్ అన్నారు.
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప..
‘ఉద్యోగులు, పెన్షన్‌దారులు సకాలంలో వేతనాలు పొందే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కును మీ ప్రభుత్వం కాలరాస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఎ) ప్రకారం సకాలంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించింది. రాష్ట్రప్రభుత్వం సకాలంలో ఉద్యోగుల, పెన్షన్‌దారులకు సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమే. భారతరాజ్యాంగంలో ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదనే విషయం రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా మీకు తెలియనిది కాదని’ కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఎమోషనల్ కథ చెప్పారు..
‘‘రిటైర్ అయ్యేనాటికే లెక్కా ఆచారం కంప్లీట్‌గా ఉండాలే. రిటైర్ అయ్యేలోపే ఉద్యోగులకు ఇయ్యాల్సిన ప్యాక్ తయారు చేసి, రెడీగా పెట్టి.. రిటైర్ అయిన రోజున ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి, పూల దండ ఏశీ, శాలువ కప్పి, ప్యాక్ చేతిల పెట్టి ప్రభుత్వ వాహనంలోనే ఆయన్ను ఇంటి దగ్గర దించి రావాలే అధ్యక్షా. దీన్ని వందకు వందశాతం తొందర్లోనే తీసుకొస్త’’ అని సీఎంగా మీరు అసెంబ్లీలో ఒక ఎమోషనల్ కథ చెప్పి సంవత్సరాలు గడుస్తున్నయ్ కానీ ఇప్పటికి పెన్షన్‌దారుల తిప్పలు తప్పలేదని బండి సంజయ్ అన్నారు. కనీస వైద్య ఖర్చులకు సైతం పెన్షన్ డబ్బులపైనే ఆధారపడే పెన్షన్‌దారుల ఇబ్బందులు వర్ణనాతీతం అన్నారు.
బండి సంజయ్ తన లేఖలో ఇంకా ఏం రాశారంటే.. ‘వేతనాలు, పెన్షన్‌లు మాత్రమే కాకుండా ఇతర అత్యవసర బిల్లులు కూడా తెలంగాణ ప్రభుత్వం పెండిగ్‌లో పెడుతోంది. హెల్త్ రియింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్, జీపీఎఫ్, అడ్వాన్స్‌లు, పార్ట్‌ఫైనల్ విత్‌డ్రాయిల్ ఇలా అన్ని బిల్లులు నెలలుగా పెండిగ్‌లో ఉంటున్నాయి. దీంతో నెలసరి ఆదాయాలపైనే ఆధారపడిన ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల చెల్లించాల్సిన ఈఎంఐ (EMIs), బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2,45,257 కోట్లు కాగా, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,08,212 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలకు అయ్యే వార్షిక వ్యయం రూ.25 వేలకోట్లుకాగా, పెన్షన్ చెల్లింపులు రూ.11 వేలకోట్లు, అంటే ప్రతినెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులకు చెల్లించేది కేవలం రూ.3 వేలకోట్లు. ఈ మాత్రం బడ్జెట్‌ను సైతం సకాలంలో విడుదల చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయుల. పెన్షన్‌దారులు, కాంట్రాక్టు సిబ్బంది పట్ల వ్యవహరించడం సిగ్గుచేటు ’ అన్నారు బండి సంజయ్.