Bhadradri Crime News: భర్త ఉద్యోగం తనకు కావాలనుకుంది. అందుకోసం ఏం చేయాలా అని బాగా ఆలోచించి అతడిని చంపేస్తే.. కారుణ్య నియామకం కింద తనకు భర్త ఉద్యోగం వస్తుందని భావించింది. ఈ క్రమంలోనే నిద్రలో ఉన్న భర్తను కర్రతో కొట్టి చంపేసింది. ఏం తెలియన్నట్లు నాటకమాడింది. కానీ కుమారుడికి తన తండ్రి మృతిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు భార్యే నిందితురాలని తెలుసుకొని షాకయ్యారు.
అసలేం జరిగిందంటే..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గాంధీ కాలనీకి చెందిన 50 ఏళ్ల కొమ్మరబోయిన శ్రీనివాస్ కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పని చేస్తున్నారు. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారిపడ్డాడని, తనకు తీవ్ర గాయం అయిందని భార్య సీతా మహాలక్ష్మి (43) మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే కొద్ది గంటలపాటు చికిత్స చేసిన అనంతరం అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులంతా అక్కడకు చేరుకున్నారు. అయితే శ్రీనివాస్ కుమారుడు సాయి కుమార్ కు తన తండ్రి మృతిపై అనుమానం కల్గింది. వెంటనే ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తనను ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో సీతామహాలక్ష్మి కనిపించకుండా పోయింది. ఈమెపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు.
మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు రాగా.. అదుపులోకి తీసుకొని విచారించారు. గురువారం రోజు రాత్రి తన భర్త తాగిన మైకంలో ఇంటికి వచ్చాడని.. గాఢ నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టానని నిందితురాలు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆపై అతడిని వంట గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టినట్లు... ఉదయం కాగానే జారి పడ్డాడని నాటకం ఆడుతూ ఆస్పత్రికి తీసుకొచ్చిట్లు వివరించిందని చెప్పుకొచ్చారు.
ఇటీవలే నిజామాబాద్ లో భర్తను చంపిన భార్య - సాయం చేసిన కుమారుడు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన బట్టు జమున, రంజిత్ కుమార్ భార్యా భర్తలు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది అక్టోబర్ 20వ తేదీన తన భర్త అదృశ్యం అయ్యాడంటూ భార్య బట్టు జమున పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు దోషి భార్య జామున అని తేలింది. జమున గొల్ల నగేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరికి భర్త రంజిత్ కుమార్ అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం భర్తను హత్య చేసింది.
ఈ హత్యలో గొల్ల నగేష్ తో పాటు జమున తండ్రి బైండ్ల గంగారాం, జమున పెద్ద కొడుకు కూడా చేయి వేశారు. అయితే తండ్రిని చంపేందుకు కుమారుడు, మామ ఒప్పుకోవడం గమనార్హం. భర్త వేధిస్తున్నాడంటూ జమున చెప్పిన మాటలు విన్న వాళ్లు రంజిత్ ను చంపేందుకు ఆమెతో చేయి కలిపారు. మొత్తం నలుగురు కలిసి మద్యం మత్తులో ఉన్న రంజిత్ కుమార్ ను పొలంలో కర్రలతో గట్టిగా తలపై బాదారు. అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత అక్కడే ఉన్న మామిడి చెట్టు వద్ద గోతి తవ్వి పూడ్చేశారని నిందితురాలు జమున విచారణలో ఒప్పుకున్నట్లు ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు.