Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బాబును అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. కావాలని కక్ష పూరితంగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరం చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని.. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా వ్యక్తిని అరెస్టు చేయడమే అర్థం కావట్లేదని చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజీ వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు. 






"తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ ఎఫ్ఐఆర్ ల పేరు లేదని చెప్పి పోలీసులే స్పష్టం చేస్తున్నరు. ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని, గతంలో ముఖ్యమంత్రిని ఆదర బాదరగా అట్ల అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ పగలు, రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఏ పార్టీ, ఎవరైనా కూడా నేరుగా తలపడతరు. కానీ ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని ఈ విధంగా అరెస్టు చేసి రిమాండ్ చేయడం అది వాళ్లు తవ్వుకున్న గోతిల వాళ్లే పడుతున్నరు. ఏడ పోయినా ఇది తప్పని అంటున్నరు. చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని ప్రతీ ఒక్కళ్లు అంటున్నరు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇది కక్ష పూరితంగా అరెస్ట్ చేసిన విషయం స్పష్టంగా కనపడుతుంది. అటువంటప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తున్నది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్స్ అవుతున్నరు.


అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నరు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నరు. రాజకీయాలతో సంబంధం లేదు. ఇలా మాట్లాడితే ఏజెంట్ అంటరు. వైఎస్ఆర్సీపీ వాళ్లు.. ఎవరు ఏం మాట్లాడిన చంద్రబాబు ఏజెంట్లు అంటరు. లేకపోతే పవన్ కల్యాణ్ ఏజెంట్లు అంటరు. వాళ్లే సుద్ధపూసలు అన్నట్టు ఇగ. తప్పును తప్పనుడు కూడా తప్పే అంటరు. వాస్తవాన్ని గ్రహించాలి. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నయి. సామాన్య ప్రజలు తిరగబడుతున్నరు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరైనా చెప్పినప్పుడు సరిదిద్దుకుంటే.. పార్టీకి మైలేజీ వస్తది. అరె కరెక్టే చేసిర్రు అని అంటరు. కానీ కక్ష పూరితంగా వ్యవహరించి జైల్లనే ఉంచుతం అంటే అది ప్రజలు ప్రశ్నస్తరు కదా. ఎన్నికలప్పుడు పోతే వాళ్లు అడిగేది అదే. ఎఫ్ఐఆర్ లో పేరు లేద కదా ఎందుకు అరెస్ట్ చేసిర్రు అంటరు. జీ20 సదస్సు అంత గొప్పగా జరిగితే.. నువ్వు ఆరోజే అరెస్ట్ చేస్తివి. తెలుగు మీడియా మొత్తం డైవర్ట్ అయ్యే. తెలుగు రాష్ట్రాల ప్రజలు కనీసం జీ20ని వీక్షించే పరిస్థితి లేదు ఆరోజు. ఎంత దుర్మార్గం అది. ఆరోజే దొరికిందా నీకు. చంద్రబాబు అరెస్టు టీడీపీకి మంచి మైలేజీ ఇస్తది." - బండి సంజయ్