Bandi Sanjay Comments on Congress Leaders: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు మీ తల్లికే పుట్టారా గ్యారంటీ ఏంటి అని వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ సోమవారం (ఫిబ్రవరి 26) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టాడనేందుకు గ్యారంటీ ఏంటని కాంగ్రెస్ నేతలు అంటున్నారని గుర్తు చేశారు. రాముడు అయోధ్యలోనే పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. మరి మీరు మీ తల్లికే పుట్టారనేందుకు గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.






కవిత లిక్కర్ కేసు గురించి మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ, బీజేపీకి సంబంధం లేదని అన్నారు. వారికి ఉన్న అధికారాలు, ఆధారాలకు లోబడే కవితపై చర్యలు తీసుకుంటారని అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే అని అన్నారు. గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారని.. యూపీఏ హయాంలో కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. గతంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ప్రచారం చేసి తమ కొంపముంచారని అన్నారు. విజయ సంకల్ప యాత్రలకు మంచి స్పందన ఉందని.. వారంలో తెలంగాణలో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నామని చెప్పారు.


కేంద్రంలో 370 పార్లమెంట్‌ సీట్లు గెలవడమే తమ లక్ష్యం అని అన్నారు. ఈసారి మోదీ నాయకత్వంలో తమ లక్ష్యాన్ని తప్పకుండా చేరుతామని అన్నారు. నరేంద్ర మోదీ కూడా తప్పకుండా మూడోసారి ప్రధాని అవుతారని అన్నారు. తెలంగాణలో కూడా హైదరాబాద్‌ సహా 17 సీట్లు గెలుస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని.. బీఆర్‌ఎస్‌ పార్టీది మూడో స్థానమే అని అన్నారు.