Bandi Sanjay comments on BRS Party: మెడమీద తలకాయ ఉన్నోడెవ్వరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని, ఒక్కసీటు రాని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సన ఖర్మ మాకెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారని తెలుసుకున్న కేసీఆర్ పొత్తు పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ బహిరంగ మిత్రులేనని, గతంలోనూ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధిని ఓడించేందుకు కుట్ర చేశాయన్నారు. ప్రజాహిత తొలిదశ యాత్ర ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రతిసారి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంతా ఆ పార్టీని వీడిపోతున్నారని తెలిసి కేసీఆర్ ఈ డ్రామాలాడుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలివి. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ ‘బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నం. కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నా. మీరెవరూ పార్టీ వీడొద్దు.’’అని మోసపూరిత మాటలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను చెబుతున్నా.. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోడు. ఎందుకంటే మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టికి ఒక్క సీటు కూడా రాదు. అయినా దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించబోతున్న బీజేపీకి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ లేనేలేదు. మోదీ హవా కొనసాగుతుండటంతో తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజలెవరూ వాటిని పట్టించుకోవద్దు
‘‘అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించబోతున్నరు. ఈ విషయం తెలిసే సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళుతున్నారు’’ అని బండి సంజయ్ మాట్లాడారు.