Rain Affect: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువలు, కాలువలు, వాగులు, వంకలన్నీ పొంగు పొర్లుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక మంది రైతుల జీవితాలు ఆగం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునగ్గా, వందలాది పశువులు చనిపోయారు. అలాగే పదుల సంఖ్యల్లో గూళ్లను కోల్పోయారు పలువురు.
110 గల్లంతు కాగా.. 35 మృతి
జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల వద్ద గల అటవీ ప్రాంతంలోకి... గత రెండు రోజుల క్రితం ఆవులు మేతకు వెళ్లాయి. సుమారు ఆరుగురుకి చెందిన ఈ 110 ఆవులు గల్లంతయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా ఉండడంతో.. అన్నదాతలు ఇంట్లోని ఉండి ఆవుల గురించి కుమిలిపోయారు. నిన్న సాయంత్రం నుంచి కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో పశువులను వెతికేందుకు వెళ్లారు. అంతా కలిసి వెతుకుతుండగా... ఒకే చోటు 35కు పైగా ఆవులు మృతి చెంది ఉండటం చూసి బావురుమన్నారు. ఇన్నాళ్లూ వాటి మీద ఆధారపడి బతికిన మా బతుకులు నాశనం అయిపోయాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆవులెలా చనిపోయాయో తెలియక..
అయితే కొన్ని ఆవులు కొన ప్రాణాలతో దొరకగా.. మరికొన్ని మిగతా వాటి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే కొన ప్రాణాలతో ఉన్న ఆవుల్లో చాలా వరకు చనిపోయేలాగా కనిపిస్తున్నాయని యజమానులు చెబుతున్నారు. చలి, వర్షం దెబ్బలకు తట్టుకోలేకే అవి ప్రాణాలు కోల్పోయాయా లేక కలుషిత నీరు తాగి చనిపోయాయో తెలియడం లేదు. కానీ కన్న బిడ్డల్లా సాకిన తమ పశువులు జీవచ్ఛవాళ్లా పడి ఉండడం చూసిన యజమానులు మాత్రం దుఃఖాన్ని దిగమింగుకోలేక పోతున్నారు. వర్షం కారణంగా జీవనోపాధి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నీటమునిగిన వేలాది ఎకరాల పంట
ఇక మరోవైపు జిల్లా వ్యాప్తంగా వేలాది రైతులకు భారీ వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కౌలుకు తీసుకొని ముందస్తు నాటిన రైతులు ఈ సారి మొదట్లోనే లక్షలు నష్టపోయారు. తొలకరి జల్లు సంబరాలు జరుపుకోవాలని అనుకున్న రైతులకు వరుణదేవుడు పట్టు పట్టినట్టుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో పొలాలన్నీ నామ రూపాలు లేకుండా ధ్వంసం అయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు వేల ఎకరాల్లో పంట వర్షానికి నీట మునిగింది.
జగిత్యాల సిరిసిల్ల లో ఈ బెడద ఎక్కువగా ఉంది పెద్దపల్లి జిల్లా లోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడంతో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది . కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా...ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది.