Karimnagar News: మీరు ఎప్పుడైనా ఒక పరీక్ష రాస్తున్నారు అనుకోండి. ఆ పరీక్షలో ఇచ్చిన ఓ ప్రశ్న మీరు రాసిన పుస్తకంలో నుంచి వచ్చింది అనుకోండి.. ఎంత వింతగా ఉంటుంది? అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా... అలాంటి సంఘటనే ఇటీవలే కరీంనగర్ రచయితకు ఎదురైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కవి, రచయితకు ఇలాంటి ఓ వింత అనుభవం ఎదురయింది. ఆ రచయిత పేరు పెద్దింటి అశోక్ కుమార్ ఆయన రచించిన పలు పుస్తకాలు, కథలు ప్రస్తుతం వివిధ యూనివర్సిటీలలో పొందుపరిచిన పాఠ్యాంశాలుగా సిలబస్ లో ఉన్నాయి. ఇక ఇప్పటికే దాదాపు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలు 6, నాలుగు పీహెచ్డీలు పొందిన ఘనత పెద్దింటి అశోక్ కుమార్ సొంతం. 


అయితే సాహిత్యానికి సంబంధించిన తెలుగులో డాక్టరేట్ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పరీక్షలు రాస్తున్నారు. అయితే అందులో భాగంగా జరిగిన ఓ పరీక్షలో తను రాసిన జిగిరీ నవల పైనే ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తే ఏకంగా 25 మార్కులు కేటాయించారు. పరీక్ష పత్రాన్ని తయారు చేసిన వారు. పెద్దింటి అశోక్ కుమార్ ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నారు. నవలలు, కథల సబ్జెక్టుకు సంబంధించి రెండవ పేపర్ విభాగంలో మొత్తం 8 ప్రశ్నలు ఇవ్వగా అందులో నాలుగింటికి సమాధానం రాయాలని సూచించారు. ఇక తను రాసిన జిగిరి నవల గురించి అందులోని పాత్రల గురించి వివరించాలంటూ అందులో పేర్కొనడంతో ఆయన ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. రాసింది తనే కాబట్టి ఆ ప్రశ్నని చాయిస్ కింద వదిలేసి మిగతా వాటి గురించి రాశారు. అయితే ఇలాంటి అనుభవం అత్యంత అరుదుగా రచయితలకు కలుగుతూ ఉంటుందని... ఆ సమయంలో ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యానని పెద్దింటి అశోక్ కుమార్ తెలిపారు. 


ఇదీ పెద్దింటి అశోక్ ప్రస్థానం...


పెద్దింటి అశోక్ కుమార్ ఫిబ్రవరి 6వ తేదీ 1968లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. మల్లవ్వ, అంజయ్య ఇతని తల్లిదండ్రులు. ఇతడు ఇంటర్మీడియట్ గంభీరావుపేటలోను, బీఎస్సీ సిద్ధిపేటలోనూ, ఎం.ఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలో, ఎంఎస్సీ గణితం నాగార్జున విశ్వవిద్యాల్యంలో చదివాడు. ప్రస్తుతం ఈయన ఇల్లంతకుంట మండలం, రామాజీపేట గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.


టీచర్ నుండి సినిమా రచయిత వరకు....


ఇక పెద్దింటి అశోక్ కథ, నవలా రచయితగానే కాకుండా సినిమాలకు కథలు, మాటలు, పాటలు రాస్తూ సినిమా రచయితగా రాణిస్తున్నారు. 1999లో రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు. మొట్ట మొదటి కథ "ఆశ- నిరాశ -ఆశ ". ఇంతవరకు 200కు పైగా కథలు, 6 నవలలు, ఏడు కథా సంపుటాలు రచించాడు. ఇతని నవల జిగిరి హింది, ఇంగ్లీష్, మరాటీ, ఒరియా, పంజాబీ, కన్నడ, మైథిలి, బెంగాలి మొదలగు ఎనిమిది భారతీయ భాషల్లోకి అనువదించబడింది. దాగుడుమూత దండాకోర్ సినిమాకు మాటలు, మల్లేశం సినిమాకు పాటలు, మాటలు రాశాడు. దొరసాని, వేదం మరికొన్ని సినిమాలకి రచనా సహకారం చేశారు. ఎనిమిది చిన్నసినిమాలకు కథలు మాటలు అందించారు. 6 నాటికలు, వంద వరకు వ్యాసాలు రాశారు. ఇతని తెగారం నాటకం నటనా విభాగంలో నంది బహుమతితో పాటు ఇప్పటి వరకు మొత్తం పాతిక అవార్డులను గెలుచుకుంది.