Teacher Letter To Somesh Kumar : తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీ క్యాడర్ బదిలీ అయ్యారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ జీఏడీలో రిపోర్టు చేసిన ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరీంనగర్ జిల్లాకి చెందిన ఓ టీచర్ రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. తాము 317 జీవో ద్వారా ఎన్ని అవస్థలు పడ్డామో మాజీ సీఎస్ కు అర్థం కాలేదని, ప్రస్తుతం కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జరుగుతుందని ఘాటుగా విమర్శించారు. 


టీచర్ రాసిన లేఖ ఇలా


 "మీకు కర్మ సిద్దాంతం అంటే ఏంతో తెలుసా? మీరు 317 జివోతో మమ్మల్ని ఉన్నట్టుండి బదిలీ చేశారు. ఉన్నకాడ మంచిగా సెట్టై ఉన్న మమ్మల్ని మా కుటుంబాలకు దూరం చేశారు. మా ఊరికి దూరం చేశారు. మా జిల్లాకు దూరం చేశారు. అన్నింటికి మమ్మల్ని దూరం చేశారు. ఇది అన్యాయం,ఉద్యోగుల విభజన ఇట్ల కాదు, సర్వీసు బుక్కులో ఉన్నవిధంగా స్థానికతను పరిశీలించండి అని అడిగినం. అలా కుదరదని క్యాడర్ సీనియారిటీ అన్నారు. సరే అలా అయితే ఫీడర్ క్యాడర్ ను కూడా లెక్కించండి అని అడిగినం. లేదు లేదు న్యాయపరమైన చిక్కులు వస్తాయని అన్నారు. మేం చేసేదేం లేక మాకు న్యాయం చేయండి అని కోర్టుకు పోయినం.  అప్పుడు కోర్టు మాకు ఏ తీర్పు ఇచ్చిందో మీకు ఇప్పుడు అదే తీర్పు ఇచ్చింది.  మీరు మమ్మల్ని బలవంతంగా ఎలా బదిలీ చేసిండ్రో కోర్టు మిమ్మల్ని కూడా అలానే  బదిలీ చేసింది. దీనినే కర్మ సిద్దాంతం అంటారు. మనం ఎవ్వరిని కూడా గోసపుచ్చుకోవద్దు. అలా చేస్తే ఆ గోస ఎప్పుడో ఓసారి మనకే తలుగుతది అని కర్మ సిద్దాంతం సారాంశం.  అప్పుడు మేం ఎంత బాధ అనుభవించామో మీకు తెలుసా? మా దినచర్య ఎంత డిస్టర్బ్ అయ్యిందో మీకు తెలుసా? మీరు పెద్ద ఉద్యోగులు, మీరు ఎక్కడికి బదిలీ అయినా మీకు ఓ పెద్ద బంగ్లా ఇస్తరు.  కాబట్టి మీరు ఎక్కడంటే అక్కడ హాయిగా కాపురం పెట్టవచ్చు. మరి మా పరిస్థితి?  సరే జిల్లాలకు బదిలీ చేస్తే చేశారు. అక్కడికి పోయినంక మా పుండు మీద కారం చల్లినట్లు దగ్గరి దగ్గరి పోస్టులను బ్లాక్ చేశారు. చేసేది లేక మీ ఆదేశాలను పాటించి మాకు ఇచ్చిన చోటుకి పోయి జాయిన్ అయ్యాం.  మొదట్లో బాధపడ్డా ఇప్పుడు సర్దుకుపోయినం. ఏడాది గడిచిందో లేదో కోర్టు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బదిలీ చేయడం పట్ల మాకు ఎంతమాత్రం సంతోషం లేదు. సాటి ఉద్యోగిగా మీకు నా  సానుభూతి  తెలియజేస్తున్నాను. మీరు ఆ రాష్ట్రానికి పోయి వాళ్లకు లేని పోని సలహాలు ఇవ్వకండి. ప్లీజ్." అని తానిపర్తి తిరుపతిరావు అనే టీచర్ లేఖలో రాశారు.  


వీఆర్ఎస్ తీసుకుంటారా?


సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లారు. ఆయన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో వెళ్లి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఇప్పుడు ఏపీలో పనిచేయడానికి సోమేశ్ కుమార్ ఆసక్తి చూపుతారా? లేక వీఆర్ఎస్ తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సోమేశ్ కుమార్ సీఎం జగన్ చాలాసేపు భేటీ అయ్యారు. పలు విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే  ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి మొదటి నుంచీ ఆసక్తి చూపని సోమేశ్ కుమార్.. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీఆర్ఎస్ తీసుకోవాలంటే ముందుగా ఏపీలో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆపై వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. జాయిన్ కాకుండా వీఆర్ఎస్ ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్ట్ చేశారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సోమేశ్ కుమార్ ఏం చేయబోతున్నారనదేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది.