Etela Rajender : కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని ఈ ముగింపు సభను పెట్టుకున్నామని బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మొదలు పెట్టినప్పుడు ఇది మనకు శ్రీరామ రక్ష అన్నారని, ఇది ఒక మానవ అద్భుతం అన్న కేసీఆర్.. గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర పోలీసు బూట్లచప్పుడు తప్ప, ఎవరినీ పోనివ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మొన్నటి వరదలకు మోటార్ లు మునిగిపోయాయన్నారు. కన్నెపల్లి పంపు హౌజ్ లో 18, అన్నారంలో 12 పంపులు మునిగాయని తెలిపారు. కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా చెల్లించారని చెప్పుకుంటున్నారన్నారు. అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ భూ నిర్వాసితులకు ఈనాటికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు.
బీఆర్ఎస్ భరతం పడతాం
"రైతుల భూములను నిండా ముంచి, రైతుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్. SRSP కి ఎత్తిపోతల ద్వారా ఒక్క చుక్క నీరు రాలేదు. మార్పుకు నాంది కరీంనగర్. డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్. 2006లో డబ్బులతో నాయకులను కొన్నా కరీంనగర్ ప్రజలు నన్ను గెలిపించారు. హుజురాబాద్ లో రూ.4000 కోట్లు ఖర్చు పెట్టినా చైతన్య ప్రజలు నన్ను గెలిపించారు. ఈ 8 ఏళ్లలో లక్షల కోట్లు ఎలా సంపాదించావో సమాధానం చెప్పు కేసీఆర్. సీఎం యావ అంతా కుటుంబం మీదే తెలంగాణ పై కాదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, పార్టీల మధ్య ఇనుప కంచెలు పెట్టిండు. అందరూ భయం నీడలో బతుకుతున్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సుఖంగా లేరు. మా మత్స్యకారుల కళ్లలో మట్టి కొట్టాలని చూస్తే సహించేది లేదు. కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి. BRS పార్టీ భరతం పడతాం."- ఈటల రాజేందర్
నా ఇంటిపైకి గూండాలను పంపారు- ఎంపీ అర్వింద్
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... ఎలక్షన్స్ రాకముందే బీఆర్ఎస్(BRS) పార్టీని రాష్ట్రం నుంచి పంపించేశామన్నారు. తెలంగాణ జాగృతి ఇప్పుడు భారత్ జాగృతి అయిందంట అంటూ ఎద్దేవా చేశారు. BRSగా TRSని మార్చింది కాంగ్రెస్ తో కలిసేందుకే అని విమర్శించారు. తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ కు అప్పగించాలన్న డీల్ ను కాంగ్రెస్ తో కుదుర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో బీ ఫామ్ లు ఇచ్చేది కూడా కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో దేశమంతా తిరుగుతాడు అట... ఇక కేటీఆర్ కు ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తాడు అట అన్నారు. ఈ కేటీఆర్ సాఫ్ట్వేర్ వాళ్ళతో, బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతారన్నారు. ఎమ్మెల్సీ కవిత తన ఇంటిపైకి గూండాలను పంపించారని ఆరోపించారు. కవితకు భయం ఉంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎలక్షన్స్ లో పెట్టే ఖర్చును రూ.100 కోట్లకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అవినీతి రహిత పాలన రావాలంటే బీజేపీ రావాలన్నారు. కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు.