ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని సామెత అందరికీ తెలిసిందే. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు కూడా అంతే అన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పొత్తులు, ఎన్నికల్లో పోటీ, తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. 


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జనసేన అధినేత పవన్ ప్రచార వాహనం వారాహి వాహన పూజ ఎట్టకేలకు పూర్తైంది. కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులతో వారాహికి పూజ ముగించిన పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఉత్సాహంగా కనిపించారు. వారాహి వాహనం నుంచి తన అభిమానులు, ప్రజలు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మాటలు ఇప్పుడు వైరల్‌ గా మారుతున్నాయి. 


తెలంగాణ గడ్డపై పుట్టిన జనసేన పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు 14 వరకు ఎంపీ, 30 ఎమ్మెల్యే సీట్లపై దృష్టిపెట్టినట్టు తెలిపిన పవన్‌ కల్యాణ్‌ ఓ వైపు పొత్తులకు ఆహ్వానిస్తూనే మరోవైపు కొత్తవారికి కూడా తన పార్టీలో చోటు కల్పించడానికి సిద్ధమని ప్రకటించారు. అంటే వలస రాజకీయాలు, రాజకీయనేతలకు అవకాశం లేదని చెప్పకనే చెబుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


తన పార్టీలో చేరేవాళ్లు చిన్న స్థాయి వ్యక్తులన్న భావన ఉంటుందని కానీ వారిలోని ఆశయం గొప్పదని చెబుతూ జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) తప్పుకోవడానికి కారణం అప్పుడు సరైన సమయం కాదన్న భావించడమేనన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటపటిమ ఎక్కువన్న పవన్‌ కల్యాణ్‌ కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏదో చేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తోంది అందుకే నేను ఎదురుచూస్తున్నాను అన్నారు. ఇప్పుడీ మాటలే ఏపీలో రాజకీయదుమారానికి కారణమవుతోంది.


జనసేనలోని టాప్‌ కేడర్‌ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు ఏపీలోని జిల్లా అధ్యక్షులు కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పవన్‌ కల్యాణ్‌ కి క్లారిటీ లేకపోవడం వల్లే ఆయన్ను నమ్మి రాజకీయ అనుభవం ఉన్నవారు రావడానికి ఆసక్తి చూపించడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. 


ఇక తెలంగాణలో పార్టీ స్థితుగతులపై, రానున్న ఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు సందేశం ఇచ్చే స్థితిలో లేనని వారినుంచే పోరాటస్ఫూర్తిని నేర్చుకునే స్థాయిలో ఉన్నానని అంటూనే వీధి పోరాటలకు సిద్ధంగా ఉండాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తానని స్పష్టం చేసిన పవన్‌ కల్యాణ్‌ ఆయా నియోజకవర్గ సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించలేని జనసేన అధినేత వీధి పోరాటల్లో ఏం ప్రశ్నిస్తారని తెలంగాణ విపక్షాలు నిలదీస్తున్నారు.


ఏపీలో కుల, మత రాజకీయాలు నడుస్తున్నాయని అక్కడి పాలకులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారని చెబుతూ అన్నమాటలపై ద్వందార్థాలు తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, నీళ్ల కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఇక్కడి ప్రజలకు ఏపీ యువతతో ఉద్యోగఅవకాశాలుండవని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ మాటల వల్ల మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య అన్యాయం జరుగుతోందన్న భావనలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.  తెలంగాణలో ఉపాధి లేక చాలామంది గల్ఫ్‌ దేశాలు వెళ్తున్న విషయం పవన్‌ తెలుసుకుంటే మంచిదని కూడా విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. 


జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి బలం సరిపోకపోవడమేనన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా పొత్తుతో వచ్చినా, సింగిల్‌ వచ్చినా గెలిచే పరిస్ధితులు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో టిడిపి, బీజేపీలతో ఎవరితో కలిసి రానున్న ఎన్నికల బరిలో దిగుతాడో ఆయనకే క్లారిటీ లేదని ఇక తెలంగాణలోనూ సేమ్‌ సీన్‌ కాబట్టి జనసేన పేరుకే కానీ గెలుపుకు దూరమేనని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ మాటలు  ముందే ఉంటాయని కాబోలు కార్యకర్తల సమావేశంలో పవన్‌ రానున్న 25 ఏళ్లని దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం చేయడానికే ముందు ప్రాధాన్యత నిస్తానని స్పష్టం చేశారు.