Ponnam Prabhakar : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలపాలన్నదే తమ లక్ష్మమన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కౌంటర్  ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అనేది కల అన్నారు. ఎప్పటికీ నిజం కాదన్నారు పొన్నం. సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటనను ఖండిస్తున్నామన్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయ సేకరణ తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్లీ కుట్రపూరితంగా సజ్జల వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. సమైక్యాంధ్ర ముగిసిన అధ్యయనం అని, తిరిగి దానికి సంబంధించి కొత్త ఆలోచన చేయడం సరైంది కాదని అన్నారు. 


విభజన ముగిసిన అంశం 


"ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్వవుతోంది. ప్రజాస్వామ్యపద్దతిలో పార్లమెంట్ ద్వారా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసులు, న్యాయపరంగా చాలా వివాదాలు ఉండొచ్చు. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి, ప్రజల ద్వారా ఎన్నికైన రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే మళ్లీ తెలంగాణపై కుట్ర జరుగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప మళ్లీ కలిపి ప్రయత్నం చేస్తే వైసీపీ అనుకూలంగా ఉందని సజ్జల చేసిన వ్యాఖ్యలు సరికాదు. తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం చేయాలనే కుట్ర జరుగుతోంది. ఎందరో ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. సోదరభావంతో కలిసి ఉండాలని కోరుకోవాలి. తప్ప మళ్లీ ఏపీ, తెలంగాణ కలిసిపోవాలని కోరుకోవడం సరికాదు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావొచ్చు. రాష్ట్ర విభజన అనేది ముగిసిన అంశం. రాజకీయ లబ్దికోసం మళ్లీ సమైక్యవాదాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు." -  పొన్నం ప్రభాకర్ 


సజ్జల ఏమన్నారంటే? 


 కుదిరితే ఏపీ, తెలంగాణలను కలపాలన్నదే తమ విధానమని .. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదని.. అలా అయితే జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పోరాడూతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీ గట్టిగా కోరుకుందని.. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతిస్తామన్నారు. మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా.. మా ప్రభుత్వం, పార్టీ దానికే ఓటు వేస్తుందన్నారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలిపే అవకాశం ఉందా అని సజ్జల సందేహం వ్యక్తం చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే క్రమంలో ఏ అవకాశాన్నీ తాము వదులుకోమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి వైసీపీ పోరాటం చేసిందన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా మళ్లీ కలిసేందుకే వైసీపీ ఓటు వేస్తుందని చెప్పారు. అయితే విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినందున పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై తాము దృష్టి పెడుతున్నామని సజ్జల తెలిపారు.