JP Nadda : ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు.  ముగింపు సభకు పెద్ద ఎత్తున వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ప్రజలకు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఒక మంచి ఎంపీ బండి సంజయ్ మీకు దొరికారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 1403 కిమీ పూర్తి చేసుకుని కరీంనగర్ చేరిందన్నారు. ఈ యాత్ర ఇక్కడితే ఆగేది కాదన్నారు. ప్రజల గోస బీజేపీ భరోసా అని జేపీ నడ్డా అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తన పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 'అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక' ప్రభుత్వం అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే అన్నారు. 


బీఆర్ఎస్ కు నెక్ట్స్ వీఆర్ఎస్ 


"సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోదీ పాలనలోనే జరిగింది. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా?. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశాం. జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చాం. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు. కేసీఆర్ పాలనలో 3.29 కోట్ల అప్పుల కుప్పగా మారింది. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుంది. కేసీఆర్ బిడ్డ కవిత అవినీతిలో కూరుకుపోయింది. టీఆర్ఎస్  నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ నెక్స్ట్ వీఆర్ఎస్ గా మారక తప్పదు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్... ఆ హామీని నిలబెట్టుకున్నాడా?. తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్ లూఠీ చేస్తున్నారు. ధరణి పోర్టల్ పేరుతో... బీఆర్ఎస్ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారు. ఓవైసీకి భయపడే..సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేసీఆర్ జరపడం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జరిపింది." - జేపీ నడ్డా 


వచ్చేది బీజేపీ ప్రభుత్వమే 


కేసీఆర్ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని జేపీ నడ్డా ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఏమైందన్నారు. వెల్నెస్ సెంటర్ల పేరును బస్తీ దవాఖానాగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. వెల్నెస్ సెంటర్ లకు బస్తీ దవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉందన్నారు. బస్తీ దవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవని  ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీతో కలిసి రావాలన్నారు. బీజేపీ పాదయాత్రలు ఆగవన్నారు. ప్రతి గడపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు.  తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. 


జేపీ నడ్డాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు


కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు జేపీ నడ్డాను కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేపీ నడ్డా గో బ్యాక్ నడ్డా అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు ఇవ్వకుండా ప్రజల పట్ల బీజేపీ వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ ఆరోపించారు.  బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.