Million March Uppal Bhagayat July 2:  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన  తెలంగాణ స్థానికత - సవాళ్లు ' రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత  సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నేలపై స్థానికత, ముల్కీ హక్కుల కోసం గత 600 ఏళ్లుగా నిరంతర దాడి, పోరాటం జరుగుతూనే ఉన్నాయని చరిత్రను గుర్తుచేశారు. బహుమనీ సామ్రాజ్యం కాలం నాటి పోరాటాల నుండి, 1919 ముల్కీ నిబంధనలు, 1952  ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’  ఉద్యమం, 1969 ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు ప్రతి దశలోనూ తెలంగాణ యాస, భాష, ఉద్యోగ వనరులపై పరాయి పాలకులు అన్యాయం చేస్తూనే వచ్చారని మండిపడ్డారు. ఎంతోమంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కూడా నేడు స్థానికుల హక్కులు కాలరాస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలి! 

Continues below advertisement

రాష్ట్రపతి ఉత్తర్వులలో  ఉన్న నిబంధనలను తప్పుగా అన్వయిస్తూ స్థానికులకు కోలుకోలేని నష్టం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఉత్తర్వులలోని మూడు వేర్వేరు అంశాలను కలిపి చూస్తామనడం సరికాదని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నంబర్ 7 ప్రకారం స్థానికులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గౌరవ న్యాయమూర్తులు ఇక్కడి నిరుద్యోగుల దుఃఖాన్ని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని కోరారు. పక్క రాష్ట్రాల్లో మన వాళ్లు నాలుగేళ్లు చదివితే అక్కడ లోకల్‌గా గుర్తిస్తారా అని ప్రశ్నించిన ఆమె.. మన వనరులను ఇతర ప్రాంతాల వారు దోచుకునేలా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో మళ్లీ పాత ముల్కీ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.  గ్రూప్-1లో 200 మంది ఇతర రాష్ట్రాల వారే.. 

ఇటీవల ముగిసిన గ్రూప్-1 నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు జరిగిందో పెద్ద కుట్రని కవిత ఘాటుగా ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేవలం ఇద్దరికే అవకాశం ఇవ్వాల్సిన చోట, నిబంధనలను తుంగలో తొక్కి 11 మంది ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు.  బయటి రాష్ట్రాల అభ్యర్థులకు ఇక్కడి ఈడబ్ల్యూఎస్  , బీసీ-డీ   సర్టిఫికెట్లు అక్రమంగా కేటాయించి పోస్టులు కట్టబెట్టారని, మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాలలో దాదాపు 200 మంది ఇతర రాష్ట్రాల వాళ్లే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు దీనిపై న్యాయపోరాటం చేయకుండా ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లకు ప్రజాధనం ఇచ్చి కేసులను బెంచ్ మీదికి రాకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. 

Continues below advertisement

జూలై 2న ‘మిలియన్ మార్చ్’కు పిలుపు! 

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రైవేట్ రంగంలోనూ ఒక్క ఉద్యోగం రావడం లేదని కవిత ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్బీఐ  బ్యాంకుకు ఇచ్చిన భూమిని తిరిగి అమ్ముకోవడంతో ప్రభుత్వంపై సదరు బ్యాంకే కేసు వేసే దుస్థితి వచ్చిందని, ఇలాంటి వాతావరణంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒకవైపు నీళ్ల విషయంలో కర్ణాటక రాష్ట్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి మంగళహారతులు పడుతూ మన నీటి వాటాను, హక్కులను కోల్పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అన్యాయాలపై పోరాడటానికి జూలై 2న ఉప్పల్ భగాయత్ వేదికగా మరో 'మిలియన్ మార్చ్' జరగబోతోందని, హక్కుల సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.   

  సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే మేమే వెళ్తాం..  

స్థానికత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.  ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నాం.. గట్టి లాయర్లను పెట్టి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకపోతే, నిరుద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీయే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది  అని స్పష్టం చేశారు. ఈ తీర్పును ఇప్పుడే అడ్డుకోకపోతే పరాయి రాష్ట్రాల దోపిడీకి ఫ్లడ్‌గేట్లు ఎత్తినట్లే అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్-1లో చేపట్టిన నియామకాలపై  జ్యూడిషియల్ రివ్యూ కమిటీ వేసి, జరిగిన అన్యాయాలను పూర్తిగా సరిదిద్ది తీరుతామన్నారు.