Kavitha On KCR :  ఉన్నతవిద్యలో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణలో విద్యార్థులు విద్యాలయాల్లో చేరుతున్నారు.  అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ బాలికలు పెరుగుతున్నారు. కేజీ మొదలు పీజీ వరకు అన్ని విద్యావిభాగాల్లోనూ వారి సంఖ్యే ఎక్కువేనని తాజాగా గణంకాలు విడుదలయ్యాయి.  పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో 72శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. ఈ ఏడాది బీఎడ్‌లో అడ్మిషన్‌ పొందినవారిలో 81శాతం అమ్మాయిలే.  ఉన్నతవిద్య చదువుతున్న అమ్మాయిల నిష్పత్తిలో దేశంలోనే టాప్‌ -5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. 





సీఎం కేసీఆర్ పాలనలో బాలికల విద్యకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారింది.పీజీలో 72%,డిగ్రీలో 52%,గురుకులాలు,కేజీబీవీల్లో 69%,బీఈడీ ఫస్టియర్‌లో 81 %  బాలికల అడ్మిషన్లతో, ఉన్నత విద్యలో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు.  కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా,వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.కొత్త విద్యాసంస్థల ఏర్పాటు,మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణం, సంతోషకరమని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 


మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల కేటాయింపులోనూ... అతి తక్కువ వయసు ఉన్న రాష్ట్రమైన తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కవిత తెలిపారు. 





ఈ ఏడాది అమ్మాయిల కోసం కొత్తగా 53 గురుకుల డిగ్రీ కాలేజీలను సీఎం కేసీఆర్‌ మంజూరుచేశారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అమ్మాయిలు పెద్దసంఖ్యలో చేరుతున్నారు. 120 ఏండ్ల నిజాం కాలేజీ చరిత్రలో తొలిసారిగా డిగ్రీ ఫస్టియర్‌ అమ్మాయిలకు హాస్టల్‌ వసతి కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది. ఉస్మానియాలో కొత్త హాస్టల్‌ నిర్మాణానికి ఈ నెల 19న శంకుస్థాపన చేశామని... మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.18 కోట్లతో నిజాం కాలేజీలో కొత్త హాస్టల్‌ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇటీవల నిజాం కాలేజీలో విద్యార్థులు హాస్టల్ కోసం ఆందోళన చేయడంతో కొత్తగా నిర్మించిన భవనం మొత్తం వారికే కేటాయంచారు.