Delhi Liquor Case News: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె బెయిల్ కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తుండగా.. కోర్టు అందుకు అనుమతించడం లేదు. తాజాగా ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను కూడా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి తీర్పు వెలువరించారు. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానం కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కవిత ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత అభ్యర్థించారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి.
ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తొలుత కవిత బెయిల్ కోసం పలుసార్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రయత్నాలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.