Kadiam Srihari  warning to BRS leaders :  బీఆర్‌ఎస్‌ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని అవి బయటపెడితే తట్టుకోలేరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వార్నింగ్‌ ఇచ్చారు. మంగళవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు.  పల్లా రాజేశ్వర్‌రెడ్డి కారణంగానే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్ారు.  కేసీఆర్ చెవిలో దూరి తప్పుడు సమాచారం ఇస్తూ, ఇతరులపై లేనిపోని చాడీలు చెప్పి నేతలను కేసీఆర్ కు దూరం చేశారని కడియం శ్రీహరి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయిందని కూడా అన్నారు. ఇదే అభిప్రాయం తనలో మాత్రమే కాదని అనేక మంది నేతల్లో ఉందని, కావాలంటే ఎవరైనా ఆయన వ్యవహారశైలిపై అంతర్గతంగా నేతలను విచారించవచ్చని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని అన్నారు.


నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి ! 
  
 ‘కాంగ్రెస్‌ పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ.. సీబీఐ, ఈడీలను ప్రయోగించి నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో చేరితే పునీతులవుతారు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం ఉంది.  బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అడ్డుకోవాల్సి అవసరముంది. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నికల్లో నన్ను గెలిపించిన విధంగానే, కావ్యను కూడా గెలిపించాలని కోరుతున్నానన్నారు. 


ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నంచి వైదొలుగుతా ! 


ఎర్రబెల్లి దయాకర్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. నిన్ను పాలకుర్తి ప్రజలే చీకొట్టారని కడియం మండిపడ్డారు.  మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఓటమి పాలయిన ఎర్రబెల్లి దయాకర్ రావు తనను విమర్శించే స్థాయిలేదన్నారు. తన నిజాయితీ అందరికీ తెలుసునని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఎందరో పార్టీలు మారినా తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అందరి చరిత్ర తన వద్ద ఉందని, తనకు ఒక్క రూపాయి బీఆర్ఎస్ ఇచ్చినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఇలాంటి అహంకార మాటల వల్లే ఓడిపోయావు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.  ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి కిషన్‌కు కూడా వార్నింగ్‌ ఇచ్చారు. నిన్ను మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించారు. బుద్ధి లేకుండా అనవసర మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీలాంటి అందరి చరిత్రలు నాకు తెలుసు. మీరు చేసిన దారుణాలు బయటపెడితే మీరు భరించలేరు, తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 


బీఆర్ఎస్ ను వీడటం బాధగానే ఉంది ! 


బీఆర్‌ఎస్‌ను వీడటం కొంత బాధగానే ఉంది. కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్‌పై నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. చాలా మంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపై పార్టీ నేతలు స్పందించలేదు. కానీ, నాపై మాత్రం బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, వారు మాట్లాడే పద్దతి బాగోలేదు. జిల్లా స్థాయి నేతలు కూడా నాపై అనవసర కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదvdvejg.  పార్టీ తనకు అవకాశాలు ఇచ్చింది, తాను వాటిని సద్వినియోగం చేసుకున్నాని తెలిపారు.