Telangana News: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఇదీ. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు.. 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 671 అడుగులకు చేరుకుంది. గత ఏడాది కడెం ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండిపోయి.. గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వరద నీరు ప్రాజెక్టుపై నుండి పారింది. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోతుందని అందరు భయాందోళనకు గురయ్యారు.


దిగువ ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు వేరే చోట ఆశ్రయం కల్పించారు. పనిచేయని గేట్లను స్ధానిక యువకులు హ్యాండిల్ సహాయంతో ఎత్తారు. దీంతో ప్రాజెక్ట్ లో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. ఆపై అధికారులు గేట్ల మరమ్మతు పనుల కోసం ప్రత్యేక నిపుణులను పిలిపించి కొంతమేర సరీ చేయించారు. గతంలో ఉన్న బిఅర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనుల గురించీ సరిగ్గా పట్టించుకోలేదు. 




సీతక్క సందర్శన
ఆపై రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కడెం ప్రాజెక్టును జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు సందర్శించి ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం 5 కోట్లు నిధులు మంజూరు చేశారు. అయితే ఐదు కోట్ల నిధులతో ప్రాజెక్టు లో మెకానికల్ పనులకు టెండర్లు వేయగా అదనంగా మరో మూడు కోట్ల నిధులతో ప్రాజెక్టులో ఎలక్ట్రికల్ పనుల కోసం కేటాయించారు. గత మూడు నెలల నుండి ప్రాజెక్టు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గేట్ల మరమ్మతులు, రోప్స్, కౌంటర్ వెయిట్ లు, స్పిల్ వే, గండి పడిన ఎడమ కాలువ పనులు, ప్రాజెక్టు పై మొత్తం రిపేర్ల పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జూన్ నేల ప్రారంభమయింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేసేలా అధికారులు తరుచూ ప్రాజెక్టు ను సందర్శిస్తున్నారు. ఇటీవలే నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కడెం ప్రాజెక్టు ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గేట్లు సరిగ్గా పనిచేసేలా మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. ఆ తరువాత అధికారులు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా సంభందిత కాంట్రాక్టర్, సిబ్బందితో రోజు వారీగా పనులు పర్యవేక్షిస్తున్నారు. 




నిపుణుల సందర్శన
తాజాగా గురువారం హైదరాబాద్ కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ (ఈ.ఈ) కే. విద్యానంద్ బృందం కడెం ప్రాజెక్టును సందర్శించి, స్థానిక అధికారులు, సిబ్బందితో కలిసి వివరాలు తెలుసుకున్నారు. 1గేటు నుండి 18వ గేటు వరకు అన్నీటిని పరిశీలించి పూర్తీ వివరాలు సేకరించారు. ప్రాజెక్టు అన్ని విధాల సేఫ్ గా ఉందని మరమత్తు పనులు చివరి దశకు చేరుకున్నాయని, మరో వారం రోజుల్లో రెండవ గేటు కౌంటర్ వెయిట్ పెడితే పనులు పూర్తయిపోతాయని తెలిపారు. అక్కడి సిబ్బంది ప్రాజెక్టు పై ఉన్న గేట్ల రూమ్ లకు నూతన రంగులు వేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ సిబ్బంది ప్రాజెక్టు గేట్లు ఎత్తుతూ దింపుతూ గేట్లు పనిచేస్తున్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు. గేట్లు పనిచేసే మిషనరీల గేర్లకు గ్రిసింగ్ వేస్తూ... పాత చైన్లను మార్చి కొత్త చైన్లు బిగిస్తున్నారు. గేట్లు బాగపని చేసేలా వాటిని దింపి వాటి మధ్య రబ్బర్ సిల్ వేస్తున్నారు. ప్రాజెక్టు పై జరుగుతున్న మెకానికల్ ఇంజినీరింగ్ పనుల గురించి అక్కడే పనిచేస్తున్న సిబ్బంది సుఖ్ నందన్ abp దేశంతో మాట్లాడుతూ ప్రాజేక్టు పనుల గురించి తెలిపారు. ప్రాజెక్టు యొక్క మొత్తం 18 గెట్లు కూడ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పనులు చేస్తున్నామన్నారు. గేర్ విల్స్ కూ కొత్త చైన్లు బిగిస్తూ, గ్రీసింగ్ చేస్తున్నామని, గెట్ల మధ్య రబ్బర్ సీల్ వేయడం, ఇలా అన్ని చోట్లా అవసరమున్న పనులు చేస్తూ చివరి దశకు చేరుకున్నమన్నారు. కేవలం రెండవ గేటు యొక్క కౌంటర్ వెయిట్ బిగించలేదని, అది మరో రెండూ మూడూ రోజుల్లో బిగించి పనులు పూర్తి చేస్తామన్నారు, మొత్తానికి కడెం ప్రాజెక్టు పనులన్నీ చివరి దశలో ఉన్నాయనీ, మరో వారం రోజుల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. 




కడెం ప్రాజెక్టు పనులు తొందరగా పూర్తయితే స్థానిక ప్రజలు, ఆయకట్టు రైతులు అందరూ సంతోషంగా ఉంటారని, ప్రస్తుతానికైతే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయనీ, స్థానికులు, రైతులు abp దేశంతో మాట్లాడారు. వర్షాకాలం మొదలు కావడంతో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుందని, గత ఏడాది జరిగిన ఘటనను గుర్తు చేస్తూ మాట్లాడారు. గేట్లు బాగా తెరుచుకొనెలా అధికారులు సిబ్బంది, త్వరగా పనిచేయాలని, గత ఏడాది యాసంగిలో నీళ్ళందకా పంటలు వేసుకోలేదని, ప్రాజెక్టును సేఫ్ గా ఉంచేలా, ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచి ఆయకట్టూ రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.