Annamalai Meets Tamilisai: బీజేపీ తమిళనాడులో చీలికలు మొదలయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామం జరిగింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై, మాజీ చీఫ్ తమిళసై సౌందర రాజన్‌ని కలిశారు. వీళ్లిద్దరి మధ్య విభేదాలు రావడం, ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం హైకమాండ్‌ని ఇబ్బంది పెట్టింది. అక్కడి రాజకీయాల్లోనూ అలజడి సృష్టించింది. ఉనికి లేదనుకున్న రాష్ట్రంలో ఇలాంటి గొడవలు బీజేపీని మరింత ఆందోళనకు గురి చేశాయి. ఇంత చర్చ జరుగుతున్న సమయంలో అన్నామలై స్వయంగా వెళ్లి తమిళసైని ఆమె ఇంటికి వెళ్లి మరీ కలవడం ఆసక్తికరంగా మారింది. కేవలం కలవడమే కాదు. ఆ తరవాత ఆమెని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు అన్నామలై. ఓ సీనియర్‌గా ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు పార్టీని మరింత ముందుకు నడిపిస్తాయని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత వీళ్లిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. 


"డాక్టర్ తమిళసై సౌందర రాజన్‌ గారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బీజేపీలోని సీనియర్ నేతల్లో ఒకరైన ఆమె తమిళనాడు బీజేపీ చీఫ్‌గా గతంలో పని చేశారు. ఎన్నో సేవలందించారు. అనుభమున్న నేతగా, సీనియర్‌గా ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు పార్టీ అభివృద్ధికి ఎంతో అవసరం"


- కె అన్నామలై, తమిళనాడు బీజేపీ చీఫ్ 


 






లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత తమిళసై సౌందర రాజన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. AIDMK తో పొత్తు పెట్టుకుని ఉంటే బీజేపీకి సీట్లు వచ్చేవని అన్నారు. అంతే కాదు. బీజేపీ-AIDMK పొత్తు విడిపోవడానికీ అన్నామలై కారణమని పరోక్షంగానే విమర్శించారు. కలిసి పోటీ చేసుంటే DMK కి అన్ని స్థానాలు వచ్చి ఉండేవి కాదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు అన్నామలై వర్గానికి ఆగ్రహం కలిగించాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్‌ కొనసాగింది. రెండు వర్గాలూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి.ఈ విషయంలో హైకమాండ్‌ కూడా సీరియస్ అయింది. అందుకే అన్నామలై ప్రత్యేకంగా వెళ్లి తమిళసైని కలిసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. సీనియర్‌లను పక్కన పెట్టి నిన్న గాక మొన్న వచ్చిన అన్నామలైకి పార్టీలో ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు సీనియర్‌లు అసహనం వ్యక్తం చేశారు. ఆ వర్గానికి తమిళసై మద్దతుగా నిలిచారు. గతంతో పోల్చుకుంటే బీజేపీ డబుల్ డిజిట్‌ ఓటు శాతాన్ని సాధించుకోగలిగినా ఖాతా మాత్రం తెరవలేకపోయింది. కానీ...ఓటు శాతం పెరగడానికి కారణం అన్నామలై అని హైకమాండ్ ఆయనకే క్రెడిట్ ఇచ్చింది. ఇది కూడా సీనియర్‌లను కొంత ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. 


Also Read: G7 Summit: G7 సదస్సులో బిజీబిజీగా ప్రధాని మోదీ, పలు దేశాల అధినేతలతో వరుస భేటీలు