KA Paul Expells Gaddar: కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) నుంచి ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ (Gaddar) ను బహిష్కరించారు. ఈ విషయాన్ని ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) అధికారికంగా వెల్లడించింది. కేఏ పాల్ మాట్లాడుతూ.. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ 5న తన పార్టీ ప్రజాశాంతిలో గద్దర్ చేరారని అన్నారు. తాను మునుగోడులో ఎన్నికల ప్రచారానికి దిగుతున్నానని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ వెంటనే గద్దర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో డీల్ కుదుర్చుకున్నారని అన్నారు. ఈ విషయంలో తాను గద్దర్ ఇంటికి వెళితే, ఆయన భార్య, కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నారని కేఏ పాల్ చెప్పారు.
ఇటీవల గద్దర్ (Gaddar) తెలంగాణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ ప్రజా పార్టీని పెడుతున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించి గద్దర్ ఢిల్లీకి కూడా వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాలయానికి చేరుకొని దీనిపై చర్చ కూడా చేశారు. ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులతో చర్చించారు. ఇంకో నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాను పోటీకి దిగుతానని అన్నారు. అదే సమయంలో రాష్ట్ర పాలన గురించి కూడా కామెంట్లు చేశారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కావట్లేదని, పుచ్చిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విధానాలు తప్పు అంటూ మాట్లాడారు.
కొత్త పార్టీ కోసం జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలిని పెట్టారు. ఈ మూడు రంగుల్లో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారని అంటున్నారు.
గతేడాది అక్టోబరులో గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. అప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు ఉండగా అందులో బరిలోకి దిగుతారని ప్రచారం కూడా సాగింది. విప్లవ ఉద్యమాలలో ఆయన చరిత్ర తెలిసిన వారు ఇలా కేఏ పాల్ పార్టీతో ప్రజా జీవితంలోకి వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.
అంతకు ముందు గద్దర్ తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతోనే ఉన్నారు. తన కుమారుడి కోసమే గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కొద్ది రోజుల కిందట గద్దర్ ఢిల్లీలో కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరారు. ఇందు కోసం స్వయంగా ఆయా పార్టీల నేతల ఇళ్లకూ వెళ్లి మరీ మద్దతు కోరారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనతో కూడా సమావేశం అయ్యారు.