KA Paul Comments on CM KCR: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సందర్భంగా కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.


కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగిపోవడం.. తాను హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం వల్లే జరిగిందని అన్నారు. కేసీఆర్ తన తప్పును అంగీకరించకుండా ఎమ్మెల్సీ కోడ్ తీసుకొచ్చి వాయిదా వేశారని ఆరోపించారు. సచివాలయం ప్రారంభోత్సవంపై తాను హైకోర్టులో పిటిషన్ వేశానని, అది విచారణ జరుగుతున్నందుకే వాయిదా వేశారని చెప్పారు. కేసీఆర్ పుట్టినరోజున సచివాలయ ప్రారంభోత్సవం జరగకుండా చేశామని అన్నారు.


ఇటీవల సెక్రటేరియట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజైన ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అలాగే దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. అందుకే ప్రారంభోత్సవం వాయిదా వేశారని కేఏ పాల్ అన్నారు.


కేసీఆర్ పై పోరాటంలో తాను వెనక్కి తగ్గబోనని కేఏ పాల్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ వెళ్లే మార్గం సైతాన్ మార్గమని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ప్రజాశాంతి పార్టీ పెట్టానని, కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని కోరానని అన్నారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకోకపోవడంతో పతనం అంచుకు చేరుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జన్మదినం రోజు తెలంగాణ సచివాలయం ప్రారంభం కావాలని కోరుకుంటున్నానని, దాని కోసమే పోరాటం చేస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీం అని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు చాలా ఉందని హెచ్చరించారు. రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం చేశారని ఆరోపించారు. 


తెలంగాణలో ముగ్గురు శాసన సభ్యులు తనతో టచ్ లో ఉన్నారని, ప్రజాశాంతి పార్టీలో ఎవరైనా చేరే అవకాశం ఉందని పాల్ మాట్లాడారు. ఇచ్చారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముగ్గురు శాసన సభ్యులు ఎవరనేది తెలుసుకోవచ్చు అని కేఏ పాల్ అన్నారు. తాను ఎవరితో మాట్లాడుతున్నాననేది కూడా తెలుసుకోవచ్చని చెప్పారు.


తాను ఫిబ్రవరి 20న ఖమ్మంలో ఉంటానని చెప్పారు. 21న  సంగారెడ్డిలోని సదాశివపేట వద్ద ఉన్న తన చారిటీల వద్దకు వస్తానని, 25న విశాఖపట్నంలో పర్యటిస్తానని చెప్పారు. మార్పు కోసం ఆశించే యువత మొత్తం తన సమావేశాలకు రావాలని పిలుపునిచ్చారు.