Jagtial News : జగిత్యాల ప్రజావాణిలో వింత ఫిర్యాదు వచ్చింది. పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడంలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు ఓ యువకుడు. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని, వాటిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లతకు బీరం రాజేష్ అనే వ్యక్తి వినతి పత్రం అందజేశాడు.


నాసిరకం బీర్లు అమ్మకాలు


 జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బీరం రాజేష్ అనే యువకుడు జగిత్యాల వైన్స్ లలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉంచడం లేదని ఐడీవోసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కోరుట్ల, ధర్మపురిలలో అన్ని రకాల బ్రాండ్ బీర్లు అమ్ముతుంటే జగిత్యాలలో మాత్రం సిండికేట్ గా మారి నాసిరకం బీర్లు అంటగడుతున్నారని ఆరోపించాడు. ఇవి తాగిన ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఊరూరా బెల్ట్ షాపులు వెలిసి వాటి ద్వారా నకిలీ మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు కలెక్టర్ బీఎస్ లత ఎక్సైజ్ సూరింటెండెంట్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.  



నకిలీ మద్యం విక్రయిస్తున్నారు


"జగిత్యాల ప్రజావాణిలో నేను ఫిర్యాదు హాస్యాస్పదం ఉండొచ్చు. ఒక తాగుబోతులా నన్ను అనుకోవచ్చు. అయితే నాసిరకం మద్యం అమ్మడంతో అది తాగి చాలా మంది యూరిక్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. జగిత్యాలలో సిండ్ కేట్ అయ్యి నకిలీ మద్యం అమ్ముతున్నారు. దీనిపై ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాను. కొందరు సిండ్ కేట్ అయ్యి కింగ్ ఫిషర్ బీర్ అమ్మడంలేదు. ఇతర ప్రదేశాల్లో అమ్ముతున్నారు. జగిత్యాలలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. వాటిల్లో కేఎఫ్ బీర్ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ దోపిడీపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను."- బీరం రాజేశ్ 



బెల్ట్ షాపులపై ప్రతిపక్షాలు విమర్శలు


తెలంగాణలో బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఈ విషయంపై సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకోవడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ సాక్షిగా సూచించారు. ప్రతి గ్రామంలోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయని, కనుక ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం మద్యం కాకుండా మరో మార్గం చూసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్​ ఆదాయం పెంచుకోవడంపైనే ఫోకస్​ పెడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తు్న్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో లిక్కర్​ ఆదాయం రూ. 10 వేల కోట్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి రూ. 34 వేల కోట్లకు చేరింది.  అధిక ఆదాయం కోసం ఎక్సైజ్ అధికారులే గల్లీకో బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తుందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 2600కు పైగా  వైన్​ షాపులు ఉండగా వీటి పరిధిలో దాదాపు లక్ష బెల్టు షాపులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తు్న్నాయి. ప్రతి ఊరిలో సగటున పదికి పైగానే బెల్టుషాపులు నడుస్తున్నారని అంటున్నారు.  కిరాణా షాపుల్లోనూ లిక్కర్​ బ్రాండ్స్​ దొరుకుతున్నాయని అంటున్నారు.