Jaggareddy :   తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటే ఫైరయ్యే నాయకుల్లో మొదటి పేరు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిదే. అయితే రేవంత్ రెడ్డి ఎదురుపడితే మాత్రం ఆయన ఆప్యాయంగా మాట్లాడతారు. మరోసారి అదే జరిగింది. సీఎల్పీలో  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కూడా  హాజరయ్యారు.  రేవంత్ రెడ్డి సీఎల్పీలోకి వెళ్తున్న సమయంలోనే జగ్గారెడ్డి కూడా వచ్చారు. ఆ సమయంలో మీడియా  ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. తమ మధ్య గొడవలేమీ లేవని జగ్గారెడ్డి స్పష్టం  చేశారు. తమది ఒకే ఇంట్లో ఉండే తోడికోడళ్ల పంచాయతీ అని.. ఉదయం గొడవపడి సాయంత్రానికి కలిసిపోతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 


రేవంత్  రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి తనకేమీ ఇబ్బంది లేదని.. జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల వరకూ ఆయననే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాని.. ఆయన టర్మ్ అయిపోయిన తర్వాతనే తనకు చాన్సివ్వాలని హైకమాండ్‌ను కోరుతున్నాన్నారు. రేవంత్ రెడ్డి  టీ పీసీసీచీఫ్‌గా  ఎన్నికైన తర్వాత తమను కలుపుకుని పోవడం లేదని అసంతృప్తికి గురైన సీనియర్ నేతల్లో జగ్గారెడ్డి ఒకరు. మిగిలిన వారు పెద్దగా బయట మాట్లాడటం లేదు. బహిరంగంగా విమర్శలు చేయడం లేదు. కానీ జగ్గారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి  ఏ మాత్రం వెనుకాడరు. పలుమార్లు ఆయనను పార్టీ హైకమాండ్ హెచ్చరించిన వెనక్కి తగ్గలేదు. అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డితో సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం బాగానే మాట్లాడుతూంటారు. తమ మధ్య గొడవలు కుటుంబంలో గొడవని చెబుతూంటారు. 
 
తెలంగాణ కాంగ్రెస్  సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. చురుకుగా లేరు. మొత్తం రేవంత్ రెడ్డి హవా నడుస్తున్న కారణంగా వారు కీలకంగా ఉండలేకపోతున్నారు. ఈ అంశంపై ఇటీవల రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. నలుగురు మాత్రమే తన నాయకత్వంలో పని చేయలేకపోతున్నారని..మిగిలిన వారంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగామ కాంగ్రెస్ పంచాయతీ ఇటీవల హైకమాండ్ వరకూ వెళ్లింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూండటం.. సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతూండటంతో... ప్రియాంకా గాంధీనే నేరుగా కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకోవాలని డిసైడయినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


సీఎల్పీలో మీటింగ్ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ లో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారని  జగ్గారెడ్డి  ఎద్దేవాచేశారు. ‘‘ఏపీలో సీఎం మీ అన్నే కదా అక్కడ సమస్యలు లేవా?.. ఏపీలో సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు?.. త్వరలోనే షర్మిల ఫైనాన్స్ వ్యవహారాలన్నీ బయటపెడతా. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదు’’ అని హెచ్చరించారు.  ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత బీఎల్ సంతోష్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కవిత, బీఎల్ సంతోష్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఇద్దరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.