Somesh Kumar :  తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఏపీ క్యాడర్ అధికారి. అయితే క్యాట్‌లో ఆర్డర్స్ తెచ్చుకుని తెలంగాణలో కొనసాగుతున్నారు. కానీ ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన ఏపీ లో రిపోర్టు చేశారు. కానీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. తన వీఆర్‌ఎస్‌ను అనుమతించాలని కోరుతూ సోమేశ్‌ కుమార్‌ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కేఎస్‌ జవహర్‌ రెడ్డికి దరఖాస్తు పంపారు. ఇందుకు తాజాగా సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు.                                     


వాస్తవానికి సోమేశ్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ సర్వీస్‌లో కొనసాగే అవకాశముంది. ఇక, సవరించిన నిబంధల ప్రకారం.. కేంద్రం అనుమతి తీసుకోకుండానే ఏదైనా ఆల్ ఇండియా సర్వీస్ అధికారి వీఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అధికారిక ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్‌గా ఉన్నారు. కోర్టు ఆదేశాలు రాకపోతే... రిటైరయ్యే వరకూ సీఎస్‌గా ఉండేవారు.                               


సోమేష్ కుమార్ మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోనే కీలక బాధ్యతలు చేపడతారన్న ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నమ్మకమైన అధికారి. ఆయన స్వస్థలం బీహార్. సోమేష్ కుమార్ కి బిహార్ లోని రాజ‌కీయ‌లపై ప‌ట్టు ఉంది. ప్ర‌శాంత్ కిషోర్ తో గంట‌ల కొద్దీ మాట్లాడే చ‌నువు ఉంది. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. స‌ర్వేల ఇన్ పుట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు కేసీఆర్ కి చేర‌వేయ‌గ‌ల‌రు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు బిహార్ లోని ఏదో ఓ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దింపవచ్చని భావిస్తున్నారు.  


తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకు వచ్చే ఎన్నికల వరకూ సలహాదారు పదవి ఇవ్వవొచ్చని చెబుతున్నారు. సీఎస్‌గా ఆయన చాలా కీలకమైన పనులను చక్క  బెడుతున్నారు. వాటిని ఆయన ద్వారానే కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ధరణి వంటి ప్రాజెక్టును ఆయనే డీల్ చేస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సోమేష్ కుమార్ ఏపీలో బాధ్యతలు చేపట్టకుండానే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు.