తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన ముఖ్యమైన వారి ఇళ్లలో మాత్రం తనిఖీలు ముగిసినట్టు ఐటీ అధికారులు చెప్పారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్టు పేర్కొన్నారు. సనత్‌నగర్‌ కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు తెలిపారు.


అయితే శుక్రవారం కూడా హెటిరో డ్రగ్స్ పై సోదాలు కొనసాగే అవకాశం ఉందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండు.. మూడు ప్రాంతాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దస్త్రాలు పరిశీలన  తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారులు బయటకు చెప్పలేదు.


గత ఫిబ్రవరి-మార్చిలో ఐటీ దాడుల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ఫార్మా సంస్థ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా దాదాపు రూ.4వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజా దాడులు ఎటు దారి తీస్తాయనేది ఉత్కంఠ ఉంది. హెటిరోపై ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 


కొవిడ్​-19 మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమై ఆసుపత్రులో చేరిన రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హెటిరో సంస్థ మరో ఔషధం అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. భారత్​లో కొవిడ్​తో ఆసుపత్రుల్లో చేరిన వయోజనులకు అందించేందుకు తమ ఔషధం టొసిలిజుమాబ్ అత్యవసర వినియోగానికి డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ఆఫ్​ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు హెటిరో ఫార్మా ఇటీవల ప్రకటించింది. ఫలితంగా కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై స్టెరాయిడ్స్​ అందుకుంటున్న లేదా ఆక్సిజన్, వెంటిలేషన్​ అవసరమైన వారికి ఇచ్చేందుకు ఆసుపత్రులకు అధికారం లభించినట్లయింది.


హెటిరో టోసిరా(టొసిలిజుమాబ్) ఔషధాన్ని తమ భాగస్వామ్య సంస్థ హెటిరో హెల్త్​కేర్​ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు హెటిరో గ్రూప్​ ఛైర్మన్​డాక్టర్​ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు. హైదరాబాద్.. ​జడ్చర్లలోని హెటిరో బయోఫార్మాలో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు పార్థసారధి రెడ్డి ప్రకటిడం తెలిసిందే.





కొవిడ్ చికిత్సలో కీలకంగా భావిస్తున్న మందుల్లో ముందు వరుసలో నిలిచిన టోసిలిజుమాబ్‌ ఔషధాన్ని హైదరాబాద్‌ సంస్థ హెటిరోనే రూపొందించింది. టోసిలిజుమాబ్‌ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతిచ్చింది. కొవిడ్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దల్లో స్టెరాయిడ్స్‌ పనిచేయని, ఆక్సిజన్‌ అవసరమయ్యే రోగులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్నారు. బయోసిమిలర్‌ వర్షన్‌ టోసిలిజుమాబ్‌ను హెటెరో అనుబంధ కంపెనీ హెటెరో హెల్త్‌కేర్‌ టోసిరా పేరుతో విక్రయించనుంది. 20 మిల్లీలీటర్ల వయల్‌ రూపంలో కంపెనీ రూపొందించింది.