N convention Centre Demolision | ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారన్నది హైడ్రా ఆరోపణ. ఈ కారణంగా ఈవాళ ఉదయం నుంచి కూల్చి వేతలు సాగాయి. చివరకు సినీ నటుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. అయితే 2014లోనే ఎన్ కన్వెన్షన్ పై అప్పటి కేసీఆర్ సర్కార్ కన్నెర్ర జేసినా కూల్చివేతకు పాల్పడలేదు. ఆ తర్వాత సినీ రంగ ప్రముఖులంతా బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సన్నిహితంగా మెలగడంతో సినీ రంగ ప్రముఖల పట్ల బీఆర్ఎస్ సానుకూలంగా వ్యవహరించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సినీ రంగానికి, ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగ ప్రముఖులను నంది అవార్డులతో ప్రభుత్వం సత్కరించేది. రాష్ట్ర విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కాని, ఇటు తెలంగాణ కాని ఇలా అవార్డులు ఇవ్వడం మానేసింది. అయితే నంది అవార్డు స్థానంలో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు సినీ రంగ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అయితే దీనిపై వారి నుండి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో గత నెల డాక్టర్ . సి. నారాయరెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే తన అసహనం బయట పెట్టారు. అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని ప్రభుత్వం చెప్పినా ఏ ఒక్కరూ స్పదించలేదని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా అలా వ్యాఖ్యానించారంటే ప్రభుత్వ పెద్దల్లో ఎంత కోపం ఉంటే అలా బయటపెట్టి ఉండవచ్చన్న చర్చ అప్పట్లో అటు ప్రభుత్వ వర్గాల్లోను, సినీ రంగంలోను చర్చకు దారి తీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో కలివిడిగా ఉన్న సినీ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ సాగింది. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఒకరిద్దరు సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసినా, సినీ రంగం ప్రభుత్వానికి మద్ధతుగా నిలబడ్డట్టు కనపడం లేదన్న అసంతృప్తి కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గూడు కట్టుకుందన్న చర్చ జరిగింది. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ప్రముఖ నటుటు మెగాస్టార్ చిరంజీవి స్పందించి గద్దర్ అవార్డుల విషయంలో సినీ నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్ చొరవ తీసుకోవాలని ఎక్స్ వేదికగా స్పందించారు.
రెండు మూడు రోజుల క్రితమే ప్రభుత్వం ఈ గద్దర్ అవార్డుల కమిటీ విధి విధానాల రూపకల్పనకు ఓ కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నాటకీయ పరిణామాల మధ్య గద్దర్ అవార్డుల కమిటీ ఏర్పాటయింది. దానికి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సినీ రంగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే తప్ప సినీ ప్రముఖులు స్పందించకపోవడం అటు ప్రభుత్వానికి, ఇటు సినీ రంగానికి మధ్య ఉన్న దూరాన్ని సూచిస్తోంది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సినీ పెద్దలకు ఓ హెచ్చరికనా..?
గత కొద్ది రోజులుగా హైడ్రా అధికారులు చెరువులను ఆక్రమించుకుని నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. ఈ ప్రకంపనలు ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల నేతలకు తగిలింది. తమ స్వంత నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంటే మంత్రులు మొదలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. అయితే పోలీసు అధికారి అయిన ఎవీ రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా రావడంతో తన స్వంత స్టైల్లో పని చేపట్టారని మొదట్లో అందరూ భావించారు. అయితే ఈ రకం స్టైల్ వర్క్ కు ప్రభుత్వ బాస్ ల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతోనే రంగనాథ్ మరో ఆలోచన లేకుండా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు అని చూడకుండా అక్రమ నిర్మాణాలను కూల్చడమే లక్ష్యంగా సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
చెరువుల పరిరక్షణకు, అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చట్టం రూపొందిస్తుందని, హైడ్రాకు అవసరమైన మానవ వనరులను సమకూర్చనుందని సమాచారం. ఇప్పుడున్న కొద్ది వనరులతోనే ఈ రంగా పని చేస్తే, ప్రభుత్వ సహాయ ,సహకారాలు హైడ్రాకు లభిస్తే చాలా మంది రాజకీయ,సినీ, వ్యాపర రంగంలోని ప్రముఖల అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం తప్పదని హైడ్రా అధికారులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువు ఆక్రమిత నిర్మాణం పేరుతో కూల్చివయడం చర్చాంశనీయంగా మారింది. ఈ కూల్చివేత ఘటన నిజంగా గత కొద్ది రోజులుగా సాగుతున్న కూల్చివేతల్లో భాగమా, లేక తమ ప్రభుత్వం పట్ల సినీ పెద్దలు చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి ఓ హెచ్చరికా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం స్టైల్లో చెప్పాలంటే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎలాగో, లోకల్ గా అంటే తెలంగాణ పరిధిలో హైడ్రా కూడా ఓ రాజకీయ ఆయుధంగా మారిందా అన్న కోణంలోను చర్చ సాగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే సినీ నటుడు నాగార్జున సినీ రంగంలో చిన్న స్థాయి వ్యక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భావించే ఇద్దరిలో ఒకరయిన అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు. తర్వాతి తరంలో నలుగురు అగ్రనటులు ఉంటే అందులో ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల హీరో. అన్నపూర్ణ స్టూడియో అధినేత. ఓ సక్సెస్ పుల్ నిర్మాత. బిజినెస్ మ్యాన్ ఇలా సినీ రంగంలో ప్రముఖ స్థానం నాగార్జునది. అలాంటి వ్యక్తి నిర్మాణాన్ని కూల్చివేయడం అంటే చిన్న విషయమేని కాదు. ప్రభుత్వ పెద్దల సూచన లేకుండా హైడ్రా ఈ చర్యకు దిగే పరిస్థితి లేదన్న వాదన ఉంది.
ఇదే నిజమైతే మరి కొద్ది మంది సినీ ప్రముఖులకు ఈ హెచ్చరిక సెగ తగలనుందా అన్న ఆందోళనలో సినీ వర్గాలు ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు వెళుతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా హైడ్రా నిర్ణయాలు మాత్రం సర్వత్రా సంచలనం కలిగిస్తున్నాయి. హైకోర్టు నుండి స్టే వచ్చేలోపే అలాంటి టైం ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. తెల్ల వారు జామునే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు సమయం పట్టింది. ఈలోగానే హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేల మట్టం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా అక్కడ భవనం మాత్రం లేదు. కూల్చివేసిన భవన వ్యర్థాలు తప్ప. ఇది పోలీస్ మార్కు వ్యూహత్మక ఆపరేషన్ గా , ఏవీ రంగనాథ్ తన దైన స్టైల్లో చేసిన ఆపరేషన్ గా చర్చ సాగుతోంది.