Irctc Special Tour Package To Kerala: పర్యాటక ప్రాంతం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కేరళ. నడి వేసవిలో ప్రకృతి ఒడిలో చల్లగా సేద తీరాలనుకునే వారు ముందుగా ఎంచుకునే ప్రాంతం. 'గాడ్స్ ఓన్ కంట్రీ'గా పిలిచే ఇక్కడ హిల్ స్టేషన్స్, బ్యాక్ వాటర్స్, అభయారణ్యాలు, అటవీ ప్రాంతాలు, చెట్ల మధ్య వంపులు తిరిగే రహదారులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా టూర్ కు వెళ్లాలనుకునే చాలా మంది కేరళ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ‘కేరళ హిల్స్ అండ్ వాటర్’ పేరిట ఐఆర్ సీటీసీ తక్కువ ఖర్చుతోనే ఈ ప్యాకేజీ అందిస్తోంది. దీని ద్వారా కేరళకు వెళ్లాలనుకునే వారి కోసం  ఏప్రిల్ 23, 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అంటే ప్రతీ మంగళవారం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. టూర్ ముగిసిన అనంతరం మళ్లీ ఆయా స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది.


ప్యాకేజీ వివరాలు



  •  కంఫర్ట్ లో (థర్డ్ ఏసీ బెర్త్) ఒక్కో ప్రయాణికుడికి రూమ్ సింగిల్ షేరింగ్ లో అయితే రూ.35,570, ట్విన్ షేరింగ్ కు రూ.20,430, ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,570 ధరగా నిర్ణయించారు. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ కు రూ.8,840, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,580 చెల్లించాలి.

  • అదే 4 నుంచి 6 ప్రయాణికుల ప్యాకేజీలో.. ఒక్కో ప్రయాణికునికి కంఫర్ట్ (థర్డ్ ఏసీ)లో ట్విన్ షేరింగ్ రూ.18,570, ట్రిపుల్ షేరింగ్ రూ.16,090, 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ కు రూ.10,730, విత్ అవుట్ బెడ్ తో రూ.8,470 గా ధర నిర్ణయించారు.

  • అలాగే, స్టాండర్డ్ లో (స్లీపర్ బెర్త్), రూమ్ సింగిల్ షేరింగ్ అయితే రూ.32,860, ట్విన్ షేరింగ్ కు రూ.17,720, ట్రిపుల్ షేరింగ్ కు రూ.13,860 గా ధర నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ తో రూ.6,130, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.3,870 చెల్లించాలి. 

  • అదే 4 నుంచి 6 ప్రయాణికులైతే.. ఒక్కో ప్రయాణికునికి స్టాండర్డ్ స్లీపర్ బెర్త్ లో ట్విన్ షేరింగ్ రూ.15,860, ట్రిపుల్ షేరింగ్ రూ.13,380 గా నిర్ణయించారు. అదే 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ తో రూ.8,030, విత్ అవుట్ బెడ్ తో రూ.5,760 చెల్లించాలి.


ప్రయాణం ఎలా అంటే.?



  • మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 12:20 గంటలకు రైలు బయలుదేరుతుంది. రెండో రోజు మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్ తీసుకెళ్తారు. అక్కడి హోటల్ లో రాత్రికి బస ఉంటుంది.

  • మూడో రోజు ఎరవికుల నేషనల్ పార్క్, మెట్టుపెట్టి డ్యామ్ వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. ఆ రాత్రి మున్నార్ లోనే బస ఉంటుంది.

  • నాలుగో రోజు ఉదయం అలెప్పీ చేరుకుంటారు. ఆ రోజంతా అలెప్పీ చుట్టుపక్కనున్న అందాలను వీక్షించడానికి వెళ్తారు. రాత్రికి అక్కడే హోటల్ లో బస ఏర్పాటు చేస్తారు.

  • ఐదో రోజు అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 11:20 గంటలకు రైలు బయల్దేరుతుంది. ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.


ఇవి గుర్తుంచుకోండి


ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో స్లీపర్, థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీని బట్టే రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.


కేరళలో 3 రాత్రులు ఉండడానికి గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది. అలాగే, టోల్, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.


అయితే, టూర్ లో మధ్యాహ్నం, రాత్రి భోజనం వంటివి యాత్రికులే చూసుకోవాలి. పర్యాటక ప్రదేశాల్లో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే అది యాత్రికులే చెల్లించాలి.


బోటింగ్, హార్స్ రైడింగ్ వంటివి ప్యాకేజీ భాగం కాదు. గైడ్ ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.


క్యాన్సిల్ చేయాలనుకుంటే.?


ఒకవేళ, ఏదైనా అనుకోని కారణాలతో ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనీ రీఫండ్ చేస్తారు. 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్ కు క్యాన్సిలేషన్ కింద రూ.250 మినహాయించి మిగతా మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అదే 8 - 14 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే 25 శాతం, 4 - 7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. అదే, ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ సమయంలో ప్రయాణం రద్దు చేసుకుంటే నగదు రీఫండ్ ఉండదు. పూర్తి వివరాలకు ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్ సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించగలరు.