IPS Jitender as Telangana DGP  :  తెలంగాణలో డీజీపీని మార్చారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తా స్థానంలో  సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చే్శారు. రవి గుప్తాకు హోంశాఖ స్పెషల్ సెక్రటరీ బాధ్యతలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఫలితాలు వెలువడక ముందే రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఆగ్రహించి బదిలీ చేసింది. ఆ స్థానంలో రవి గుప్తాను నియమించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ..సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డీజీపీగా రవి గుప్తానే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇటీవలి కాలంలో మారుతున్న పరిణామాలు, వరుస ఘటనల కారణంగా డీజీపీని  మార్చాలని నిర్ణయానికి వచ్చి జితేందర్ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 


ఉమ్మడి రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించిన జితేందర్                                


1992 బ్యాచ్‌ ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన జితేందర్ సొంత రాష్ట్రం పంజాబ్. ప్రస్తుతం ఆయన డీజీ ర్యాంక్ లో ఉన్నారు. ఇప్పటి వరకూ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా , విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో  నిర్మల్‌  ,  బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు.   ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు. డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో  పని చేశారు.  హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు.  వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. 14 నెలలపాటు ఆయన డీజీపీగా  కొనసాగే అవకాశం ఉంది.   డీజీపీని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకోలేదు కానీ రాష్ట్రంలో పరిస్థితులు .. లా అండ్ ఆర్డర్ పై వస్తున్న విమర్శలతో కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదని చెబుతున్నారు.                                                


సీనియర్ అధికారుల విషయంలో రేవంత్ ప్రత్యేక గౌరవం                      


అధికారుల వి,యంలో  రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి కేసీఆర్ హయాంలోనే నియమితులయ్యారు.  ఆయినప్పటికీ ఆమెను మార్చలేదు. ఏపీలో చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డిని చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే సెలవులో పంపించారు. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి.. రిటైరయ్యేలా చేశారు. అయితే జవహర్ రెడ్డిపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్ కుట్రను అమలు చేసి .. పెద్ద ఎత్తున వృద్దుల మరణాలకు కారణం అయ్యారని ఆరోపణలు చేసింది.