నిమ్స్ ఆసుపత్రిలో అంతర్గత ఆన్ లైన్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభాగాల వారీగా ఓపీ, ఇన్ పేషెంట్ వారీగా ఒక్క క్లిక్ దూరంతో సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నల్ ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే, ఓపీ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి టెస్టులు చేసుకొని, ఫలితాలు వచ్చి, వైద్యుడిని కలిసి ట్రీట్‌మెంట్ పొందేవరకు.. ఈ ప్రాసెస్ అంతా పర్యవేక్షించేందుకు అంతర్గత ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. దీనికోసం ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. NIMS, NNJ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. నిమ్స్ పై ప్రజల్లో నమ్మకం ఉందని, దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొంతకాలంగా చేస్తున్న కృషివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ కొరత లేకుండా చూడటంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. అయితే ఎమర్జెన్సీ బెడ్స్ నిర్వహణ మరింత మెరుగవ్వాలని సూచించారు. స్టెబిలైజ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు పేషెంట్లను సంబంధిత వార్డులకు షిప్టు చేస్తూ, ఎమర్జెన్సీలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ బిల్లుల చెల్లింపు కోసం కొత్త కౌంటర్లు ప్రారంభించడం శుభపరిణామం అన్నారు మంత్రి హరీష్ రావు. నిమ్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం, నిలోఫర్ పీడియాట్రిక్ విభాగం కలిసి యూకే వైద్య బృందం సహకారంతో చిన్నారులకు గుండె సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. అవసరమైన వారికి చికిత్స అందించేలా ప్లాన్ చేయలన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి వీలైతే అదేరోజు ఓపీ, కన్సల్టేషన్, టెస్టులు, డాక్టర్ మెడికల్ అడ్వైజ్ పూర్తయ్యేలా చూడాలన్నారు. దీనికోసం రివ్యూ ఓపీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇకపోతే, హాస్పిటల్ పరిసరాల్లో, లోపల పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాబోయే వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిమ్స్ ఆసుపత్రి నుంచి బయటి వాహనాలు రాకపోకలు కొనసాగించకుండా చూడాలన్నారు. వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ తగ్గించాలని సూచించారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు పేషెంట్లకు, వారి అటెండెంట్లకు సహకరించాలన్నారు.
మొబైల్ కేన్సర్ స్క్రీనింగ్ ను ఎక్కువగా జిల్లాల్లో నిర్వహించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కొత్తగా ప్రారంభించిన మాడ్యులర్ థియేటర్లు పూర్తిస్థాయిలో పని చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 300 పడకల MNJ కొత్త బ్లాక్ ప్రారంభిస్తామని తెలిపారు.
నిమ్స్ ఆసుపత్రికి మంత్రి అభినందనలు:
జనవరి నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జీలు పూర్తిచేసి నిమ్స్ ప్రతిష్టను జాతీయస్థాయికి తీసుకెళ్లినందుకు వైద్యులను అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం, డోనర్లు, సర్జరీల విషయంలో 2022 ఏడాదికి తెలంగాణ దేశంలోనే నెంబర్1గా ఉందనీ హర్షం వ్యక్తం చేశారు. దీని వెనుక నిమ్స్ కృషి చాలా ఉందనీ, జీవనానంద్ కోఆర్డినేటర్ డా. స్వర్ణలత, డీఎంఈ, నిమ్స్ డైరెక్టరుకు హరీష్ రావు అభినందనలు చెప్పారు.
అలాగే ఆర్థో విభాగానికి సంబంధించి స్కోలియోసిస్ (గూని) సమస్య ఉన్నవారికి గడిచిన 3 ఏళ్లలో 200 మందికి సర్జరీలు చేసి నిమ్స్ వైద్యులు చికిత్స అందించారనీ, గతేడాదిలోనే దాదాపు 80 సర్జరీలు చేయడం గొప్ప విషయమని అన్నారు. వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. పరిశోధనల విషయంలో నిమ్స్, MNJ ఆసుపత్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది హరీష్ రావు తెలిపారు.