Bhatti Vikramarka: ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాల కోరని.. జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.  హిందువులు, ముస్లింలు అంటూ మతాల పేరిట రాజకీయాలు చేయడం తప్ప బీజేపీకి మరో ఎజెండా అనేది లేదని.. ఆ పార్టీపై విరుచుకుపడ్డారు.  పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫరీద్ కోట్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం భట్టి విక్రమార్క లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 


రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధర 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా (I.N.D.I.A)  కూటమి అధికారంలోకి రాగానే రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధర అందిస్తామని ప్రకటించారు. దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాని మోడీ నల్ల చట్టాలు అమల్లోకి తీసుకుని వచ్చి ఎంతో కష్టపడి సంపాదించిన రైతుల ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి వచ్చిన తర్వాత దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాలను రూపొందించి అమలులోకి తీసుకొస్తామన్నారు. దేశంలోని డిగ్రీలు చదివి పట్టాలు పొందిన వారు, డిప్లొమా చేసిన వారందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకుని వస్తామన్నారు.  


అదానీ, అంబానీలే ఎక్కువ బాగుపడ్డారు 
 దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా, మిగిలిన వాళ్లంతా పేదవాళ్లుగా ఉండిపోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారంటూ భట్టి విక్రమార్క విమర్శించారు.  గత పదేళ్ల కాలంలో అదానీ, అంబానీలే అత్యధికంగా బాగుపడ్డారని ఆయన ఆరోపించారు.  మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత రాజ్యంగం అంతమవుతుందన్నారు. అప్పుడు దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు అనేవే ఉండవని, ద్రవ్యోల్బణం, ధరలు విపరీతంగా పెరుగుతాయని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు.  ఈసారి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుందన్నారు. గత పదేళ్ల కాలంలో ఎన్నో హామీలిచ్చిన మోడీ.. వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. మోడీ అబద్ధాలకోరని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 లక్షల రూపాయలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఎన్నో  అబద్ధాలు చెప్పారంటూ మండిపడ్డారు. 


30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి 
ప్రస్తుతం దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో కలిపి సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి ఈ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల కష్టాలు తీరుస్తామని భట్టి విక్రమార్క హమీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కోట్లాది మంది నిరుద్యోగుల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష నగదును జమచేస్తామన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు అందజేస్తున్న రోజు వారి కూలీ  రూ.250ని రూ.400కి పెంచడంతో పాటు ఆశావర్కర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. 


గత పదేళ్ల  కాలంలో ప్రధాని మోడీ 25 మందికి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు.  ఆ డబ్బులతో సుమారు 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని  అమలు చేయొచ్చన్నారు. బీజేపీ సర్కారు 25 మందిని కుబేరులని చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోందని.. అందుకే కాంగ్రెస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ మోడీ విమర్శలు చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు.