Heat Waves And Rains In Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో జనం అల్లాడుతున్నారు. రాత్రి పూట ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో (Telangana) తీవ్ర ఎండలతో ఐఎండీ వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజులు పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. మరో 2 రోజులు హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


ఈ జిల్లాల్లో వర్షాలు


అయితే, తెలంగాణలోని (Telangana) కొన్ని జిల్లాల్లో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తాయని.. గంటకు 40 నుంచి 50 కి.మీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు.


ఏపీలో ఇదీ పరిస్థితి


అటు, ఏపీలోనూ ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. శనివారం 7 జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి, నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయగా.. సోమవారం 22 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట కలిగించేలా ఐఎండీ చల్లటి కబురు అందించింది. రాబోయే 2 రోజులు రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అక్కడకక్కడ ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని.. సోమవారం దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు.


'అప్రమత్తంగా ఉండాలి'


ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగటి పూట అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. ఒకవేళ బయటకు వస్తే గొడుగు, క్యాప్, వాటర్ బాటిల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.


Also Read: Top Headlines Today: పవన్ కల్యాణ్ ఇంటి అద్దె అంత తక్కువా?- ‘న్యాయ్‌’తో కాంగ్రెస్ కొత్త నాటకంటూ కేటీఆర్ ఫైర్