ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వడగాలుల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.


ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాగల 2, 3 రోజులలో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని  మరి కొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.






ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వీటితో వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వీటితో వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


ఏపీలో మొత్తం 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయని అమరావతి కేంద్రం తెలిపింది. పార్వతీపురం మన్యంలో 44.87 డిగ్రీలు, విజయనగరంలో 44, అనకాపల్లిలో 43.9, ఏలూరులో 42.2, అల్లూరిలో 42.7, తూర్పుగోదావరిలో 42.5, విశాఖపట్నంలో 41.3, ఎన్టీఆర్‌లో 41.9, గుంటూరులో 41, పలనాడులో 41, బాపట్లలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరో రెండ్రోజుల పాటు కోస్తాంధ్రలో వేడి గాలులు కొనసాగే అవకాశం ఉంది. నేటి నుంచి రాయలసీమ జిల్లాల్లో వేడిమి వాతావరణ పరిస్థితులు తగ్గే సూచనలు ఉన్నాయి.


ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఏపీలోని శ్రీహరి కోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగరి, కొప్పాల్ వరకూ విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఈనెల 18 నుంచి నైరుతి పవనాలు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నాయని, దీంతో రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.