Telangana Weather Update: ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటింది. శుక్రవారం నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. ముందుగా రుతుపవనాలు మే 31న కేరళకు చేరుకుంటాయని భావించగా, ఒకరోజు ముందుగానే అంటే మే 30వ తేదీకే కేరళ తీరానికి చేరుకుంది. శుక్రవారం కేరళలోని మిగిలిన మరి కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉరుములు, మెరుపులతో వర్షం
రేపు అంటే శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అలాగే వచ్చే నెల రెండో తారీఖున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాదీలకు కూల్ న్యూస్
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎండలు దంచి కొడుతున్న వేళ వాతావరణ శాఖ రాజధాని వాసులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. నగరంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. జూన్ 2న చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి తదితర మండలాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 4వరకు ఎల్లో అలెర్ట్ ఆచరణలో ఉంటుంది.
ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటింది. గురువారం మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలలో 47 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాలలో 47.2 డిగ్రీలకు, భద్రాద్రి కొత్తగూడెంలో 47.1, ఖమ్మంలో 47 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే అంబర్‌పేటలో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ వాతావరణ శాఖ మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది.