Heavy Temparatures In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి నమోదు కాగా.. రాగల రెండు రోజులు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం ఖమ్మం జిల్లాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకూ ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
కొన్ని జిల్లాలకు చల్లటి కబురు
అటు, రాగల 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని చెప్పారు. బుధవారం.. మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి.. గురువారం కోమరిన్ ప్రాంతం నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకూ విస్తరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీల ఎత్తులో కొనసాగుతోందని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2015, 16 తర్వాత మళ్లీ అదే స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో ఇదీ పరిస్థితి
అటు, ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం 40కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు, రాబోయే 2 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. కోస్తా జిల్లాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వృద్ధులు, చిన్నారులు అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వస్తే వెంట వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
Also Read: Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో