వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంగళవారం (మార్చి 28) ఉదయం అక్కడ జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోయారు. ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడం కోసం ఆమె బయలుదేరేందుకు యత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చి వైఎస్‌ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోయారు.


ఆ తర్వాత తనను అక్కడి నుంచి వెళ్లేందుకు వీలు కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో అక్కడే కాసేపు బైఠాయించారు. ఉస్మానియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని వైఎస్ షర్మిల విమర్శించారు. 200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం తొమ్మిది ఏళ్ల క్రితం చెప్పారని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలకు వైద్యం అందడం లేదని తనకు ఫిర్యాదులు వచ్చాయని, ప్రతిపక్షాలను ఆపడానికి యత్నిస్తూ.. శాంతి భద్రతల సమస్య తలెత్తిందని అంటారా అని షర్మిల అన్నారు.


‘‘నిన్నటి వరకు తెలంగాణ మా తాతల జాగీరు.. నేను తెలంగాణ ముద్దుబిడ్డను.. నాకు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎవరికి లేదు అని చెప్పుకొన్న దొర గారికి.. దేశాన్ని దోచుకోవాలని కల పడగానే.. దేశ పౌరున్ని అనే సంగతి గుర్తుకువచ్చింది.. దేశ రాజకీయాలు చేయడం గుర్తుకువచ్చింది.. అయ్యా దొర.. మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా మాట్లాడింది.. లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే, ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంది. మరి ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు?  ఏం సంజాయిషీ ఇచ్చుకొంటావు? ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు?


నేను తెలంగాణ కోడలినైనప్పటికీ నన్ను ఆంధ్రా ద్రోహి అని మీ పార్టీ వాళ్లు అవహేళన చేసినప్పుడు.. మీకు నేను ఇక్కడి కోడలినని, ఈ దేశ పౌరురాలినని గుర్తుకురాలేదా?  మీకు చెప్పడానికి నోరు రాలేదా? నరం లేని నాలుక వంద అబద్దాలు చెబుతుందన్నట్లు మన దగ్గరికి వస్తే ఒక న్యాయం, మందికైతే ఒక న్యాయమా?’’ అని వైఎస్ షర్మిల వరుస ట్వీట్లు కూడా చేశారు.