Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలు లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వేళ ఆమె స్పందించారు. తెలంగాణ బంగారు తెలంగాణ కాదని.. ఇది బానిసత్వపు తెలంగాణ అని షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారని.. అది సాధ్యమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే మంత్రి కేటీఆర్‌ విలీనం గురించి ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. బంగారు భారతదేశం అంటూ కేసీఆర్ జోకులు బాగానే వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ ఎక్కడ ఉందని.. రాష్ట్రాన్ని తాగుబోతులు, అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని అన్నారు. బడులు, గుడుల కంటే రాష్ట్రంలో వైన్ షాపులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.


తెలంగాణలో 59 ఏళ్లు దాటిన రైతుకు బీమా ఎందుకు వర్తించడం లేదని ప్రశ్నించారు. రైతులందరికీ బీమా వర్తింపజేయాలని ఇప్పటికే తాము హైకోర్టును ఆశ్రయించామని గుర్తు చేశారు. అయితే, 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని గుర్తు చేశారు. అసలు తెలంగాణలో 66 లక్షల మంది రైతులుంటే 41 లక్షల మందికే బీమా వర్తించడం ఏంటని ప్రశ్నించారు. 59 ఏళ్ల లోపే రైతులు చనిపోవాలని ప్రభుత్వం భావిస్తోందా అని నిలదీశారు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. ఎల్‌ఐసీలో 70 ఏళ్లు పైబడిన వారికి కూడా పాలసీలు ఉన్న విషయాన్ని షర్మిల గుర్తు చేశారు.


‘‘కాంట్రాక్టు ఉద్యోగులు ఉండవు. అందరిని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బంగారు తెలంగాణ కాదు, బతుకే లేని తెలంగాణ చేశారు. ఒకప్పుడు కేసీఆర్ స్కూటర్ మీద తిరిగేవాడు, ఇప్పుడు ప్రగతిభవన్ ఆడంబరాలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయింది. మీరు కమీషన్లు తీసుకొని మీ కుటుంబమే బాగుపడితే దాన్ని బంగారు తెలంగాణ అనరు. కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి నీళ్లను ఎత్తి సముద్రంలో పోస్తున్నారు. కోట్లల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక్కసారి ప్రగతి భవన్, ఫామ్ హౌస్ బయటకు వచ్చి చూస్తే అసలు రంగు బయటపడుతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. తెలంగాణలో గెలిపించుకున్నందుకే ఏడుస్తున్నారు. ఇక దేశాన్ని ఏలతాడు అనేది పెద్ద జోక్. 


కనీసం రైతులకు నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదు. దళితులకు అడుగడుగునా అవమానాలే. దళితులు చనిపోయేలా చేస్తున్నారు. మహిళలకు ఎక్కడుంది గౌరవం. మొన్నటిదాకా మహిళా మంత్రి, మహిళ కమిషనే లేదు. ఎవరి బెదిరింపులకు భయపడం, పార్టీ పెట్టాం, పోరాటం చేస్తా. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే తెలంగాణకు అంత మంచిది. బీజేపీ మతతత్వ పార్టీ, వారి అవసరాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుంటుంది. కేసీఆర్ కేటీఆర్‌లు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడతారు. బీజేపీ, టీఆర్ఎస్‌లకు తేడా ఏముంది’’ అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.