కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా చిన్న దొర అబద్ధాల ప్రసంగం ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంత్రి కేటీఆర్ శనివారం (ఫిబ్రవరి 4) అసెంబ్లీలో విపక్షాలకు ఇచ్చిన కౌంటర్ కామెంట్లపై షర్మిల స్పందించారు. నిజాలు కప్పిపుచ్చి, అబద్ధాలు వల్లించడం మంత్రి కేటీఆర్ కే చెల్లిందని షర్మిల ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రుణ మాఫీ గురించి ప్రస్తావించకుండా నటించడం మంత్రి కేటీఆర్‌కే సాధ్యం అని వైఎస్ షర్మిల వరుస ట్వీట్లు చేశారు.
‘‘కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు కప్పిపుచ్చి,అబద్ధాలు వల్లించడం ఆయనకే చెల్లింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్ రూం ఇండ్ల, రుణమాఫీ గురించి ప్రస్తావించకుండా నటించడం చిన్నదొరకే సాధ్యం. మీ పాలనలో నిధులు ఏరులై పారితే.. సర్పంచుల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? నిరుద్యోగం లేకుండా చేస్తే.. దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఎందుకుంది? తెలంగాణ ధాన్యాగారమైతే వడ్ల రాశులపై గుండెలు ఆగిన దారుణ పరిస్థితులు ఎందుకొచ్చినయ్? కాళేశ్వరం పర్యటనకు విదేశీయులకు అనుమతి ఉంది కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు అనుమతి లేదు? రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఆత్మహత్యలే లేవు అన్న సన్నాసి ఎవరు?
పోడు పట్టాలు అడిగితే బేడీలు వేసి, కొట్టించిన దుష్టుడు ఎవరు? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిదేండ్లుగా సాగదీస్తూ రైతుల ఉసురు తీస్తున్న దుర్మార్గుడు ఎవరు? ట్రిబ్యునల్ మీటింగ్ లకు డుమ్మాలు కొట్టిన పనికిమాలిన వ్యక్తి ఎవరు? ధనిక రాష్ట్రమని గప్పాలు కొడుతున్న చిన్న దొర.. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు చెల్లించడం లేదు? రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? కార్పొరేషన్ లోన్లు ఎందుకు ఇవ్వడం లేదు? డిస్కంలకు బకాయిలు ఎందుకు కట్టడం లేదు? సున్నా వడ్డీ రుణాలు ఎందుకివ్వడం లేదు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? బీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని భయపడి, మంచి స్క్రిప్ట్ చదివి, మభ్యపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు చిన్న దొర’’ అంటూ వైఎస్ షర్మిల వరుస ట్వీట్లు చేశారు.
పాదయాత్రపై మళ్లీ దాడులు - షర్మిల
ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న వైఎస్ఆర్టీపీ ప్రజాప్రస్థాన యాత్రలో బీఆర్ఎస్ నేతలు అలజడి సృష్టిస్తున్నారని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమలపురంలో నిన్న ఆమె మీడియాతో మాట్లాడారు. పర్వతగిరి మండలం తురకల సోమారం వద్ద బీర్ ఎస్ పార్టీ నేతలు ప్లెక్సీలు చించి వేయడం హేయమైన చర్య అన్నారు. నిన్న తురకల సోమారం వద్ద జరిగిన ఘటనలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు భేషరతుగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న ప్రజాప్రస్థాన యాత్రలో బీఆర్ఎస్ నేతలు అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తనను అడ్డుకునే కుట్ర జరుగుతోందన్న షర్మిల మీడియాలో వచ్చిన వార్తల ఆదరంగానే నేను మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ను విమర్శించానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే యాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారన్నారు.