Hyderabad to Varanasi flight | హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడి అత్యుత్సాహంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళకు గురయ్యారు. సౌరబ్ కుమార్ అనే యువకుడు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కాడు. కానీ కొంత సమయానికే అతడ్ని విమానం నుంచి కిందకు దించేశారు. బిహార్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు సౌరబ్ కుమార్ ఓ ప్రముఖ సంస్థలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు. అయితే విమానం ఎక్కిన యువకుడు ఎమర్జెన్సీ ప్యానెల్ కవర్ ప్లేట్ తొలగించడానికి ట్రై చేశాడు. తోటి ప్రయాణికులు విమాన సిబ్బందిని ఈ విషయంపై అప్రమత్తం చేశారు. అలర్ట్ అయిన సిబ్బంది సౌరభ్ కుమార్ ను విమానం నుంచి అత్యవసరంగా కిందకి దించేశారు. అతడిపై మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించాడన్న కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో బాలరాజు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. 

సౌరభ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఇందులో ఏం దురుద్దేశం లేదన్నాడు. కేవలం ఎగ్జైట్ మెంట్‌తోనే ఈ పని చేశానని విచారణలో తెలిపాడు. అయితే తాను చేసిన పనికి విమానం నుంచి కిందకి దింపేశారని చెప్పుకొచ్చాడు.