HYDRA Latest News: ఫిర్యాదు చేయకుండానే ఆరోపణలు- కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలపై హైడ్రా ఘాటు రియాక్షన్
HYDRA Latest News: ఫిర్యాదుల స్వీకరించడంలో హైడ్రా సరిగా స్పందించడం లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలను కమిషనర్ ఖండించారు. తమకు ఆయన ఫిర్యాదులే చేయలేదన్నారు.

HYDRA Latest News: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 3వ తేదీన హైడ్రా స్పష్టమైన ప్రకటన చేసింది. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అవకతవకలు నిజమైన పక్షంలో హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేయడంతోపాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హైడ్రా పేరును వినియోగించుకుని వసూళ్లకు పాల్పడినా, అవకతవకలు చేసినా వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురిపై కేసులు కూడా పెట్టామన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే తమ దృష్టికి కాని, ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు.
వంశీరాం బిల్డర్లపై ఎమ్మెల్యే ఫిర్యాదు అందలేదు
గత సంవత్సరం 18.8.24న, 21.12.24 తేదీల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి హైడ్రాకు రెండు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఖాజాగూడలోని తౌతానికుంటలో నీరు నిలిచిపోవడం వల్ల.. గ్రీన్‌గ్రేస్ అపార్టుమెంట్ సెల్లార్‌లోకి నీరు చేరుతోందనేది మొదటి ఫిర్యాదు. తౌతానికుంట నిండిన తర్వాత వరద నీరు భగీరథమ్మచెరువుకు వెళ్లడంలేదనేది రెండో కంప్లైంట్.
ఈ రెండు ఫిర్యాదులపైన కూడా నేరుగా తానే రెండు సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్న విషయాన్ని కమిషనర్ రంగనాథ్ గుర్తు చేశారు. పై నుంచి వచ్చిన వరదను తౌతానికుంటకు తర్వాత భగీరథమ్మ చెరువులోకి వెళ్లే అవకాశాలను పరిశీలించారు. భగీరథమ్మ చెరువులో ఆక్రమణలు గతేడాది డిసెంబరు చివరి వారంలో హైడ్రా తొలగించిందని తెలిపారు. వంశీరాం మ్యాన్‌హట్టన్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఈ విషయంలో వారి వద్ద ఏమైనా ఫిర్యాదు ఉంటే వాట్సప్‌లో అయినా పంపితే పరిశీలిస్తామన్నారు. గతంలో ఎమ్మెల్యే వాట్సాప్‌లో సమస్యను చెబితే స్పందించామని తెలిపారు. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఫిర్యాదు ఎవరిదైనా తక్షణ స్పందన :
ఫోన్‌లు వస్తే వెంటనే మాట్లాడి సమస్య తెలుసుకోవడం.. ఒక వేళ సమావేశాల్లో ఉన్నప్పుడు ఫోను లిఫ్ట్ చేయలేకపోయినా.. ఫిర్యాదుదారులు మెసేజ్ పెడితే స్పందించడం సర్వసాధరణంగా జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌గారు తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనే కాకుండా పని దినాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిర్యాదులకే స్పందన కరువా అని అనిరుధ్‌రెడ్డి ఆరోపణలు చేసినట్టు వచ్చిన వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు.
ఫిర్యాదులపై వెంటనే చర్యలు:
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా వెంటనే స్పందిస్తుందని గుర్తు చేశారు. నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటోందన్నారు. ఫిర్యాదులపై హైడ్రా వెంటనే స్పందిస్తుందని ప్రజలు గ్రహించారన్నారు హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. ఇలా హైడ్రాకు 9800ల ఫిర్యాదులందాయని పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు పరిష్కారమయ్యాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, సాంకేతికంగా, క్షుణ్నంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారానికి సమయం తీసుకోడానికి ఇవే కారణాలని రంగనాథ్ చెప్పారు.
ఫిర్యాదులపై సమీక్ష:
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ నిర్వహించే ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులు పరిశీలిస్తారు. ఫిర్యాదుదారుల ముందే.. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ఆధారంగా.. అప్పటికప్పుడే సమస్యపై చర్చించి.. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఫిర్యాదుల పరిష్కారం ఎంతవరకు వచ్చిందనేది వారంలో రెండు రోజులు కమిషనర్ సమీక్షిస్తారు. కొన్ని ఫిర్యాదులపై నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారు.